తీవ్రవాదులు ద్విచక్ర వాహనాలపై వచ్చి.. జన సమూహంపై కాల్పులు జరపడం లేదా జనంలో కలిసిపోయి ఒక్కసారిగా కాల్పులు జరిపే సన్నివేశాలు కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. అమెరికా న్యూయార్క్లో అచ్చం అలాంటి ఘటనే జరిగింది.
సమయం శనివారం రాత్రి 11 గంటలు.. కట్ చేస్తే..
కీన్స్ పట్టణంలోని ఓ రెస్టారెంట్లో పార్టీ జరుగుతోంది. దానికి సమీపంలోని ఓ బార్బర్షాపు వద్ద కొందరు గుమిగూడి.. వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఇద్దరు దుండగులు కాలినడకన నెమ్మదిగా వచ్చి.. ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో చెల్లాచెదురుగా పరుగు తీయగా.. 10 మంది గాయపడ్డారు. కాల్పుల అనంతరం.. ద్విచక్ర వాహనాలపై సిద్ధంగా ఉన్న సహచరులతో కలిసి పారిపోయారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేదని తెలిపారు. బాధితులంతా.. 19 నుంచి 72ఏళ్ల మధ్య వయసువారేనని పేర్కొన్నారు.
నిందితుల్లో ముగ్గురిని ట్రినిటారియోస్, డొమినికన్ స్ట్రీట్ గ్యాంగ్ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోకపోవడం గమనార్హం.
ఇదీ చూడండి: 'డెల్టా' దెబ్బకు ఆసుపత్రులు ఫుల్- మళ్లీ ఆంక్షలు!