జింబాబ్వేకు సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా వ్యవహరించిన.. రాబర్ట్ ముగాబే కన్నుమూశారు. 2017లో సైనిక స్వాధీనంతో అధ్యక్ష పదవి కోల్పోయారాయన. కొద్ది కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన... సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో 95 ఏళ్ల వయసులో చికిత్స పొందుతూ మరణించారు.
ప్రస్తుత అధ్యక్షుడు ఎమర్సన్ నంగాగ్వా.. ఆయన మరణాన్ని ధ్రువీకరించారు. ముగాబేను విముక్తికి చిహ్నంగా కొనియాడారు.
బలమైన నేత...
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు జింబాబ్వే రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించారు ముగాబే. ఆఫ్రికా విముక్తి పోరాట వీరుల్లో ఒకరిగా నిలిచారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం, వలసవాదం, మైనారిటీ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.
పాశ్చాత్య దేశాల ఆంక్షలతో జింబాబ్వే ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుందని వాదించిన బలమైన నేతగా పేరుగాంచారు. సోషలిస్ట్ భావాల పట్ల ప్రభావితమయ్యారు.
నియంతగా ముద్ర...
1980లలో తెల్లవారి మైనారిటీ పాలనకు ముగింపు పలికి అధికారంలోకి వచ్చారీ గెరిల్లా చీఫ్. వీటికి విరుద్ధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత... వివాదాస్పద నేతగా పేరు పొందారు. ఆర్థిక సంక్షోభం, భారీ అవినీతి, జాత్యహంకారం, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలతో... ఆయనపై నియంతగా ముద్ర పడింది.
1980-87 మధ్య జింబాబ్వేకు ప్రధానమంత్రిగా సేవలందించారు. 1987 నుంచి 2017 వరకు 30 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా కొనసాగారు.
తీరని కోరిక...
జింబాబ్వేను 30 ఏళ్లకుపైగా పాలించిన రాబర్ట్ ముగాబే జీవితకాలం జింబాబ్వేకు అధ్యక్షుడిగా కొనసాగాలనుకున్నారు. ఓ సందర్భంలో ఆయన ఇది చెప్పగానే దేశమంతా అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. సైనిక జోక్యం, అభిశంసన చర్యలు, వీధి ప్రదర్శనలతో దద్దరిల్లింది. సైనిక తిరుగుబాటుతో... 2017లో అధ్యక్ష పదవి కోల్పోయారు.
2018 ఫిబ్రవరి 21న ఆయన రాజీనామా అనంతరం.. విలాసవంత జీవితానికి దూరంగా తొలి పుట్టినరోజును ఏకాంతంగా జరుపుకున్నారు.