కరోనాను అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేయాలని నిర్ణయించింది దక్షిణాఫ్రికా ప్రభుత్వం. ఈ మేరకు అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ప్రకటన విడుదల చేశారు. ఐదు దశల్లో ఆంక్షలను సడలించనున్నట్లు స్పష్టం చేశారు.
మార్చి 27నుంచి దక్షిణాఫ్రికాలో లాక్డౌన్ కొనసాగుతోంది.
ప్రస్తుతం ఐదో దశలో..
ప్రస్తుతం దేశంలో ఐదో దశ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఆర్థిక సంక్షోభం, పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడం, వ్యాపారాల మూసివేతకు లాక్డౌన్ కారణమవుతోంది. ఈ నేపథ్యంలో దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేయనున్నారు.
నాలుగో దశలో..
పలు కఠిన ఆంక్షలతో కొన్ని వ్యాపారాలను ప్రారంభిస్తారు. సరిహద్దుల మూసివేత కొనసాగుతుంది. ప్రయాణాలపై ఆంక్షలు యధావిధిగా ఉంటాయి. విదేశాల్లోని దక్షిణ ఆఫ్రికా పౌరులను స్వదేశానికి తీసుకువస్తారు. దేశంలో ఉన్న విదేశీయులను స్వదేశాలకు పంపించేందుకు మాత్రమే ఏర్పాట్లు చేస్తారు.
మూడో దశలో..
పని ప్రదేశాలు, సమావేశాలు సహా పలు కార్యకలాపాలపై ఆంక్షలు ఉంటాయి. సామాజికంగా వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ చర్యలు తీసుకుంటారు.
రెండో దశలో..
ఆంక్షల నుంచి పలు సడలింపులు ఉంటాయి. భౌతిక దూరం పాటిస్తూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మొదటి దశలో..
ముందుజాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ కార్యక్రమాలు చేపట్టేందుకు అనుమతిస్తారు. ఆరోగ్య నియమాలను అన్ని వేళలా పాటించాల్సి ఉంటుంది.
లాక్డౌన్ ఆంక్షలను సడలించేందుకు ఏప్రిల్ 30 తర్వాత ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లనున్నట్లు ప్రకటించారు రామఫోసా.
ఇదీ చూడండి: కరోనా వ్యాక్సిన్‌పై మళ్లీ ట్రయల్స్- ఫలితంపై ఉత్కంఠ