సోమాలియా రాజధాని మొగదిషులో జరిగిన బాంబు పేలుడు ఘటనలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈ కారు బాంబు పేలుడు ఘటనలో మరో 125 మందికి పైగా క్షతగాత్రులయ్యారని తెలిపారు.
చెక్‌పాయింట్ వల్ల...
మొగదిషులోని పన్ను కార్యాలయానికి సమీపంలో ఉన్న చెక్‌పాయింట్ వద్ద ట్రాఫిక్ ఏర్పడటం.. అదే సమయంలో పేలుడు సంభవించడం వల్ల ఘటన తీవ్రత ఎక్కువగా ఉంది. విశ్వవిద్యాలయ విద్యార్థులు ఉన్న బస్సు.. పేలుడు పదార్థాలున్న కారును ఢీకొట్టడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుందని భావిస్తున్నారు. అందువల్ల మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు టర్కీ దేశస్థులూ ఉన్నారు.
మొగదిషులో తరచూ కారు బాంబు పేలుళ్లు, దాడులు జరుగుతుంటాయి. అల్‌ఖైదా అనుబంధ సంస్థ అల్-షాబాద్ ఇస్లామిక్ మిలిటెంట్స్ ఈ దాడులకు కారణం. అయితే తాజా ఘటన ఆ దేశంలో గత రెండేళ్లల్లోనే అత్యంత ఘోరమైందని తెలుస్తోంది.