ఆఫ్రికా దేశాల్లో సరైన తిండిలేక అనేకమంది పిల్లలు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. ఒకవేళ వెళ్లినా రాణించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కెన్యా పాఠశాలల్లోని విద్యార్థులకు తక్కువ ఖర్చుకు పౌష్టికాహారం అందించేందుకు ముందుకొచ్చింది 'ఫుడ్ ఫర్ ఎడ్యుకేషన్' అనే స్వచ్ఛంద సంస్థ. కెన్యా రాజధాని నైరోబి వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వేలాదిమంది విద్యార్థులకు మధ్యాహ్నం వేడి వేడి ఆహారం అందిస్తోంది ఈ సంస్థ.
'ఫుడ్ ఫర్ ఎడ్యుకేషన్' సంస్థ తాజాగా ఉండే ఆహార పదార్థాలను వండుతూ ఎంతో మందికి అండగా నిలుస్తోంది. ఇందుకు వినూత్నంగా 'ట్యాప్ టూ ఈట్' బ్యాండ్లను వినియోగిస్తోంది ఈ సంస్థ.
" 'ట్యాప్ టూ ఈట్' మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. నిత్యం వేడి వేడిగా ఉండే పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గతంలో మేం నాసికరమైన చల్లని ఆహారమే తినేవాళ్లం. కానీ ప్రస్తుతం వేడిగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నాం."
- నాన్సీ న్జేరి, విద్యార్థిని, గటోంగ్ఔరా ప్రాథమిక పాఠశాల
కార్పొరేట్ సంస్థల చేయూత
'ఫుడ్ ఫర్ ఎడ్యుకేషన్' సంస్థ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పలు కార్పొరేట్ సంస్థలు సాయాన్ని అందిస్తున్నాయి. ఒక్కో భోజనం ఖరీదు పదిహేను యూఎస్ సెంట్లు ఉంటుంది. ప్రతి భోజనం ధరలో 40 శాతం ఈ స్వచ్ఛంద సంస్థే భరిస్తోంది. ఈ సంస్థ నగదు రహిత లావాదేవీలు సాగిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులే నేరుగా తమ సెల్ఫోన్ల ద్వారా నగదు బదిలీ చేసే సౌకర్యం కల్పించారు.
"ఆఫ్రికాలో వేలాదిమంది విద్యార్థులు చాలా సార్లు ఆహారం తీసుకోకుండానే పాఠశాలలకు వెళ్తున్నారు. ఆహారం తీసుకోకుండా పాఠశాలకు వచ్చిన వారు చురుగ్గా ఉండలేరు. కొంత మంది అసలు ఆహారం లేక పాఠశాలకు వెళ్లడం లేదు. అందుకే తక్కువ ఖర్చుతో పౌష్టికాహారాన్ని అందిస్తే విద్యార్థులు పాఠశాలల్లో హాయిగా చదువుకోగలరని భావించాం. ప్రస్తుతం విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు."
-వావ్రా న్జిరూ, ఫుడ్ ఫర్ ఎడ్యూకేషన్, నిర్వాహకురాలు
ఆహారం అందిస్తారిలా..
విద్యార్థుల చేతికి 'ట్యాప్ టూ ఈట్' అని రాసున్న ఓ బ్యాండ్‌ను ఇస్తారు. దీన్ని భోజనానికి వచ్చేటప్పుడు చూపించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు ఈ బ్యాండ్లను ట్యాప్ చేసి వారికి ఆహారాన్ని అందిస్తారు. దీని వల్ల విద్యార్థులు పాఠశాలకు వచ్చారా? లేదా? అనేది కూడా తెలుస్తుంది. అంతేకాకుండా భోజన బిల్లు నేరుగా వారి తల్లిదండ్రులకే వెళ్తుంది. ఈ ప్రక్రియ మొత్తం నగదు రహితంగానే జరుగుతోంది.
ఇదీ చదవండి: తాలిబన్లతో ఇకపై చర్చలు జరగవు: డొనాల్డ్ ట్రంప్