ఆఫ్రికా దేశం ఎస్వాతీనీ ప్రధానమంత్రి ఆంబ్రోస్ మాండ్వులో డ్లామిని(52) మరణించారు. నాలుగు వారాల క్రితం కరోనా బారినపడిన ఆయన.. దక్షిణాఫ్రికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఎస్వాతీనీ ఉప ప్రధాని థెంబా మసుకు అధికారిక ప్రకటనలో తెలిపారు.
కరోనాకు మెరుగైన చికిత్స నిమిత్తం డిసెంబర్ 1న ఆంబ్రోస్ను దక్షిణాఫ్రికాకు తరలించారు. అప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు బాగా స్పందిస్తున్నారని థెంబా తెలిపారు. కానీ పరిస్థితి విషమించి ఆదివారం అర్ధరాత్రి ఆంబ్రోస్ మరణించారు.
2018 నవంబర్లో ఎస్వాతీనీ ప్రధానిగా నియమితులయ్యారు ఆంబ్రోస్. అంతకు ముందు బ్యాంకింగ్ రంగంలో 18 ఏళ్ల పాటు సేవలందించి కీలక పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఎస్వాతీనీ దేశ జనాభా దాదాపు 12లక్షలు. అక్కడ ఇప్పటివరకు 6,768 కరోనా కేసులు నమోదయ్యాయి. 127మంది ప్రాణాలు కోల్పోయారు.