ఆఫ్రికా దేశాలు మొజాంబిక్, జింబాబ్వే, మలావిలో 'ఇదాయ్' తుపాను బీభత్సం సృష్టించింది. ఈ భీకర తుపానులో చిక్కుకుని సుమారు 150 మంది వరకు మృతిచెందారు. వందలాది మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు.
సహాయక చర్యలు ముమ్మరం...
ఈ తుపాను ఆఫ్రికాదక్షిణ ప్రాంత దేశాలైన మొజాంబిక్, జింబాబ్వే, మలావిల్లోని సుమారు 15 లక్షల మందిపై ప్రభావం చూపిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. రంగంలోకి దిగిన ఐరాస సహాయక బృందాలు, రెడ్ క్రాస్ సంస్థ సహాయక చర్యలు చేపట్టాయి. బాధితులకు ఆహారం, మందులు అందజేస్తున్నాయి.
జింబాబ్వేలోని ఓ పాఠశాలలో చిక్కుకున్న 197 మంది విద్యార్థులను రక్షించడానికి సైన్యం కృషి చేస్తోంది. నేలపై దిగడానికి అవకాశం లేకపోవడం వల్ల హెలికాఫ్టర్ల సాయంతో రక్షణ చర్యలు చేపట్టింది.
"మలావిలో తుపాను తర్వాత ప్రజలు మరో ముప్పు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వరదలు ముంచెతున్నాయి"
- ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్
మలావి, మొజాంబిక్‌లోని ప్రజలకు సాయం చేయడానికి దక్షిణాఫ్రికా ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌తో సహా 10 మంది వైద్యులను పంపించింది.
తుపాను విలయం..
ఇదాయ్ తుపాను ముందుగా మొజాంబిక్‌లోని ప్రముఖ నౌకాశ్రయం బెయిరాను బలంగా తాకింది. ఈ తుపాను ధాటికి బెయిరా నగరం తీవ్రంగా నష్టపోయింది. అక్కడి విమానాశ్రయం మూసివేశారు. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. అక్కడ నుంచి తుపాను పశ్చిమ దిశగా పయనించి జింబాబ్వే, మలావిలను తాకింది.
తుపాన్ ధాటికి పాఠశాలలు, కార్యాలయాలు, వైద్యశాలలు, పోలీసు స్టేషన్లు అన్నీ నాశనమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో టెలిఫోన్, విద్యుత్ కనెక్షన్లు తెగిపోయి, రహదారులు చెడిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.