omicron variant vaccine effectiveness: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్'(B.1.1.529) ప్రపంచాన్ని(omicron variant) గడగడలాడిస్తోంది. డెల్టా వంటి రకాలకన్నా అత్యంత వేగంగా వ్యాప్తి చెందటమే కాదు, తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న కారణంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఊరట కలిగించే వార్త అందించింది దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్-19 టీకాలు కొత్తగా బయటపడిన ఒమిక్రాన్ రకంపై(Omicron news) ప్రభావంతంగా(omicron variant vaccine effectiveness) పనిచేస్తున్నాయని ఆ దేశ ఆరోగ్య మంత్రి జో ఫాహ్లా తెలిపారు. జన్యుపరమైన మార్పుల కారణంగా ఒమిక్రాన్ వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మరోవైపు.. కరోనా కొత్త వేరియంట్‌పై(Omicron news) తమ టీకాల పనితీరును అంచనా వేసేందుకు పరిశోధనలు ప్రారంభించినట్లు శుక్రవారం ప్రకటించాయి కొవిడ్-19 టీకా తయారీ సంస్థలు ఫైజర్, బయోఎన్టెక్లు. తమ ఎమ్ఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌పై ఆరు వారాలపాటు పరిశోధన చేస్తామని, కొత్త వేరియంట్‌పై పనితీరును తేల్చి.. 100 రోజుల్లోనే పంపిణీ ప్రారంభిస్తామని పేర్కొన్నాయి. మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెనెకాలు సైతం పరిశోధనలు ప్రారంభించినట్లు చెప్పాయి. బూస్టర్ డోసు తీసుకున్న ముగ్గురు వ్యక్తులపై తమ టీకాను పరీక్షించినట్లు తెలిపింది మోడెర్నా. ఎక్కువ మోతాదును సైతం ఇచ్చినట్లు పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ కోసం బూస్టర్ డోస్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది.
కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్లో 50 మ్యూటేషన్లను గుర్తించగా.. అందులో 30 స్పైక్ ప్రోటీన్లను కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అవి మానవ సెల్స్‌ను లొంగదీసుకుని వైరస్ శరీరంలోకి వెళ్లేందుకు సాయపడతాయని తెలిపారు. అయితే, ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి తొలి దశలోనే ఉందని, టీకా తీసుకున్న వారిలో ఈ వేరియంట్ ఎంత మేర ప్రభావం చూపుతుందో ఇంకా తెలియదని పేర్కొన్నారు.
ఆ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక..
కొవిడ్ కొత్త వేరియంట్ వెలుగు చూసిన క్రమంలో ఆగ్నేయాసిలోని దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. నిఘాను పెంచాలని, ప్రజారోగ్య, సామాజిక చర్యలను బలోపేతం చేస్తూ.. టీకాల పంపిణీని వేగవంతం చేయాలని సూచించింది. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే పండగలు, ఉత్సవాలు చేసుకునేలా చూడాలని, పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడటాన్ని నివారించాలని పేర్కొంది. 'ఎట్టి పరిస్థితుల్లో రక్షణ వ్యవస్థలను విస్మరించొద్దు. ఈ ప్రాంతంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు.. ప్రపంచంలోని ఇతర దేశాల్లో కొత్త వేరియంట్లు వెలుగు చూడటం వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన చర్యలను చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.' అని డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా రిజనల్ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ప్రపంచానికి కరోనా 'కొత్త' ముప్పు.. ఆంక్షల చట్రంలోకి దేశాలు!