గినియా రాజధాని కొనాక్రీలోని అధ్యక్ష భవనం వద్ద ఆదివారం తెల్లవారు జామున భారీ స్థాయిలో కాల్పులు జరిగాయి. గంటల తరబడి కొనసాగాయి. ఆ తర్వాత.. గినియా ఆర్మీ కల్నల్ ఆ దేశ టెలివిజన్ ప్రసారాల నియంత్రణను స్వాధీనం చేసుకున్నారు. అధ్యక్షుడు ఆల్ఫా కొండే ప్రభుత్వం రద్దు అయినట్లు ప్రకటించారు.
" ఒకే వ్యక్తి చేతిలో రాజకీయం అనేది ముగిసింది. మేము ఇకపై రాజకీయాలను ఒక వ్యక్తికి అప్పగించబోము. అధికారాన్ని ప్రజలకే అందిస్తాం. రాజ్యాంగం కూడా రద్దయింది. దేశ సరిహద్దులను మూసివేశం. "
- కల్నర్ మామాడి డౌంబౌయా.
ప్రస్తుతం అధ్యక్షుడు కొండే ఎక్కడు ఉన్నారనే విషయం తెలియరాలేదు. ఆర్మీ కల్నల్ మామాడి డౌంబౌయా సైతం ఆయన ఆచూకీ వివరాలను ప్రస్తావించలేదు. అధ్యక్షుడు గత ఏడాది మూడోసారి అధికారం అందించాలని ప్రజలను కోరారు. అప్పటి నుంచి ఆయనకు ప్రజాదారణ క్షీణించింది.
భారీ స్థాయిలో కాల్పులు..
గినియా రాజధాని కొనాక్రీలోని అధ్యక్ష భవనం వద్ద ఆదివారం తెల్లవారు జామున భారీ స్థాయిలో కాల్పులు జరిగాయి. గంటల తరబడి జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. సైనిక ఆక్రమణలు, తిరుగుబాటు చరిత్ర కలిగిన పశ్చిమాఫ్రికా దేశంలో భద్రతా సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే.. అధ్యక్ష భవన వద్ద పరిస్థితుల పునరుద్ధరణ, శాంతి స్థాపనకు భద్రతా బలగాలు కృషి చేస్తున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. అయితే.. అధ్యక్షుడు ఆల్ఫా కొండే నుంచి ఎలాంటి స్పందన రాకపోవటం పలు అనుమానాలకు తావిచ్చింది. మరోవైపు.. అధికారిక మీడియోలో గన్ఫైట్ గురించి ప్రసారం చేయకపోవటం గమనార్హం.
మరోమారు అధికారం కోసం..
ఆ దేశంలో రెండు పర్యాయాలు అధికారం కొనసాగించేందుకే నిబంధనలు ఉన్నాయి. అయితే.. గతేడాది తనను మరోమారు ఎన్నుకోవాలని కోరారు కొండే. రాజ్యాంగపరమైన ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం రెండుసార్లే అనే నిబంధన తనకు వర్తించదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొండేకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. డజన్ల కొద్ది ప్రజలు మృతి చెందినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఒకవేళ 2025లో కొండే తిరిగి ఎన్నికైతే.. 2030 వరకు అధికారంలో ఉంటారు.
1958 తర్వాత తొలిసారి జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికల్లో 2010లో అధికారంలోకి వచ్చారు కొండే. చాలా మంది ఆయనపై నమ్మకం పెట్టుకున్నారు. కానీ, ప్రజల జీవితాల్లో మార్పు తేలకపోయారని విపక్షాలు విమర్శలు చేశాయి.
ఇదీ చూడండి: మరో ప్రాణాంతక వైరస్- ఆఫ్రికాలో తొలి కేసు