హైదరాబాద్‌లో ఐదో రోజు పలు రోడ్‌షోల్లో పాల్గొన్న కేటీఆర్.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముషీరాబాద్, అంబర్ పేట నియోజకవర్గాల్లో గాంధీ నగర్ చౌరస్తా, రామ్ నగర్ క్రాస్ రోడ్స్, చే నంబర్, పటేల్ నగర్‌ల వద్ద నిర్వహించిన రోడ్ షో లలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆరేళ్లుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ను కాపాడుకోవాల్సిన అవసరముందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మత రాజకీయాలు చేసే వారి మాయలో పడవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్.. ఓట్ల కోసం హైదరాబాదీలను బలి తీసుకుంటారా అని నిలదీశారు.
తెరాస ప్రజలకు అండగా ఉంది
ఎటువంటి తారతమ్యాలు లేకుండా తెరాస సర్కారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఫ్లైఓవర్లు, రహదార్లతో హైదరాబాద్‌ను అభివృద్ధి బాటలో నడిపించామన్నారు. కరోనా కష్టాల్లోనూ, వరద ముంపులోనూ తెరాస ప్రజలకు అండగా ఉందని పేర్కొన్నారు.
ఎంతో అభివృద్ధి చేశాం
ఆరేళ్లలో రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేశామన్న కేటీఆర్...కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి విషయంలోనూ కేంద్రం పక్షపాతంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఓ గల్లీ పార్టీని ఓడించేందుకు కేంద్రమంత్రులు, పక్కరాష్ట్రాల మంత్రులు వస్తున్నారంటేనే.. భాజపా ఓడిపోయినట్లని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కావాలో ? అరాచకం కావాలో తేల్చుకోవాలన్న కేటీఆర్....ప్రశాంత నగరంలో చిచ్చు పెట్టాలనుకునేవారికి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: తుంగభద్ర పుష్కరాలు : ఐదో రోజూ అంతంత మాత్రమే!