బల్దియా పీఠమే లక్ష్యంగా కమలనాథులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గ్రేటర్‌లో భాజపాకు ఒకసారి అవకాశమిస్తే నగరాన్ని అభివృద్ధి చేస్తామంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపై సర్జికల్ స్ట్రైక్ కొనసాగుతుందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. బస్తీ నిద్రలో భాగంగా అల్లాపూర్ డివిజన్ అభ్యర్థి పులిగోళ్ల శ్రీలక్ష్మి ఇంట్లో బండి సంజయ్ నిద్రించారు. అంతకుముందు అమీర్‌పేట, బాలానగర్, రంగారెడ్డినగర్ రోడ్‌షోలో పాల్గొన్నారు. స్థానిక సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
భాజపా జెండా ఎగురవేస్తాం
జీహెచ్ఎంసీ పీఠంపై భాజపా జెండా ఎగురవేస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. హిమాయత్‌నగర్ డివిజన్ అభ్యర్థి మహాలక్ష్మి రామన్ గౌడ్‌కు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. నాచారం డివిజన్ అభ్యర్థి అనిత రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రచారం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని స్పష్టంచేశారు. గురువారం రోజు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముషీరాబాద్, తార్నాక, మెట్టుగూడ, బౌద్ధనగర్ డివిజన్లలో అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్‌ల వద్ద బండి సంజయ్ నివాళులర్పించనున్నారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో ఘాట్లకు తాను రక్షణగా ఉంటానని ప్రమాణం చేయనున్నారు. భాజపా నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, వివేక్, జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాస్ పలు డివిజన్‌లలో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.
ప్రచారానికి ప్రముఖ నేతలు
భాజపా ఎన్నికల మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవిస్ గురువారం నాడు.. బేగంపేట తాజ్ వివాంత హోటల్లో విడుదల చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో 27న యోగి ఆదిత్యనాథ్, 28న జేపీ నడ్డా, 29న అమిత్ షా పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరితో పాటు ఖుష్బూ, గౌతమ్ గంభీర్, సైనా నెహ్వాల్ ప్రచారానికి రానున్నట్లు భాజపా నేతలు తెలిపారు. మరోవైపు మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ భాజపాలో చేరడంతో మరింత బలం పెరిగిందని కమలనాథులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: 'మా నినాదం విశ్వనగరం.. ప్రతిపక్షాల నినాదం విద్వేష నగరం'