"నటుణ్ని అయ్యేందుకు ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా. అవమానాలు ఎదుర్కొన్నా. 'ఇప్పుడు వీడు బాగానే ఉన్నాడు కదా' అనుకుంటూ వాటి గురించి ఎవరూ మాట్లాడరు. కానీ, నటులుగా మేం మాత్రం వాటినే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటాం. ఎందుకంటే మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదని. ఏదో అవకాశం వచ్చేసింది కదా అని నేను సినిమాలు చేయను. ప్రేమతో చేస్తుంటా. సినిమాకు సంబంధించిన అన్ని పనులను చూసుకుంటా. అది పూర్తయిన తర్వాత ప్రచారాన్ని భుజాలపై వేసుకుని రోడ్లపై తిరుగుతుంటా. నా అంత కమిటెడ్, ప్రొఫెషనల్ నటుడు ఉండడు. ఈ ఏడాది నేను మూడు చిత్రాలు పూర్తి చేశా.
వాటిల్లోని ఒకదానికి నేనే దర్శకుడు, నిర్మాత, హీరో. నా వల్ల ఇప్పటివరకూ ఏ నిర్మాతా బాధపడలేదు, ఒక్క రూపాయి నష్టపోలేదు. భయపడే చిన్న ప్రొడ్యూసర్స్‌తో నేను పనిచేయలేదు. నేను చేసినవి చిన్న చిత్రాలే అయిండొచ్చు కానీ వాటిని పెద్ద నిర్మాతలు నిర్మించారు. నా సినిమాల సెట్‌లోని ఒక్క లైట్‌బాయ్ అయినా.. నన్ను కమిటెడ్, ప్రొఫెషనల్ యాక్టర్ కాదంటే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా. కొత్త దర్శకుడు అయినా, అనుభవం ఉన్న దర్శకుడితో అయినా 'గివ్ అండ్ టేక్' పద్ధతిలో పనిచేశా. అన్ని సినిమాల్లానే అర్జున్‌గారి చిత్రానికీ అదే అనుకుని ప్రారంభించా"
"‘చిత్రీకరణ మొదలయ్యే వారం ముందు నాకు ఈ సినిమా స్క్రిప్టు అందింది. 'నేను ఆఫీస్ బాయ్ ఇన్‌పుట్ కూడా వింటా ' అని అర్జున్ సర్ అన్నారు. 'నేను ఫలానా మార్పు చేస్తే బాగుంటుంది సర్' అని చెబితే నువ్వు వదిలేయ్, నన్ను నమ్ము అంటూ ఏం చెప్పనిచ్చేవారు కాదు. పది విషయాల్లో.. రెండు నా ఇష్టానికి వదిలేసినా ప్రయాణం అలా సాగిపోయేది. కానీ, నన్ను కట్టిపడేశారు. కళ్లుమూసుకుని కాపురం చేసేయ్ అన్నట్టుంది వ్యవహారం. అయినా ఏదో విధంగా ముందుకెళ్లానుకొని, లుక్ టెస్ట్‌లో పాల్గొని ఆయనకు పంపించా.
మరుసటి రోజు లేచి, షూట్‌కు బయలుదేరేముందు ఎందుకో భయమేసింది. నాకు ఏ సినిమాకీ ఇలా అనిపించలేదు. అందుకే ‘సర్.. ఈ ఒక్కరోజు షూటింగ్ రద్దు చేస్తే.. కొన్ని విషయాలు చర్చించుకుందాం’ అని మేసేజ్ పెట్టా. నేనూ మా మేనేజరు ఎన్నిసార్లు అడిగినా ఆయన నుంచి సమాధానం లేదు. అదేరోజు మధ్యాహ్నం వాళ్ల మేనేజరు నుంచి.. ‘ఇంకేంటి మాట్లాడేది’ అంటూ అకౌంట్ వివరాలు పంపించారు. చిత్రం నుంచి వైదొలుగుతానని నేను చెప్పలేదు, సినిమాని నేను ఆపలేదు".
"షూటింగ్ ప్రారంభానికి ముందు నేను క్యాన్సిల్ చేయటం తప్పే. కానీ, నాలుగు రోజులు అయిష్టంగా పనిచేసి తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాలనుకోవటం ఇంకా పెద్ద తప్పు. నాకు ఇబ్బంది కలిగితే నాలుగు గోడల మధ్యే మాట్లాడా. అంత గౌరవం ఇచ్చా. ఆయన ప్రెస్‌మీట్ పెట్టడం వల్ల ఇప్పుడు నా ఫ్యామిలీ, స్నేహితులు బాధపడుతున్నారు. నేనేం చేయాలి? నన్ను ఆ సినిమా నుంచి తొలగించారు.
అలాంటప్పుడు ఆయన చిత్రం గురించి నేనెందుకు మాట్లాడాలి? అనుకున్నా కాబట్టే నిన్న స్పందించలేదు. సినిమాల విషయంలో తప్పు చేశానంటే చెప్పండి.. ఇప్పుడే పరిశ్రమ నుంచి వెళ్లిపోతా. నా వల్ల మీకు ఇబ్బంది పడి ఉంటే క్షమించండి సర్" అని విశ్వక్ సేన్ అర్జున్‌ను ఉద్దేశించి మాట్లాడారు.
ఇదీ చదవండి: 'NTR 30' ప్రీప్రొడక్షన్ పనులు షురూ.. పవర్ఫుల్ క్యారెక్టర్లో విజయశాంతి!