Varun Dhawan Health Update: ఇటీవలే తాను వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ వ్యాధి బారిన పడ్డట్లు తెలిపిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. యోగా, స్విమ్మింగ్, ఫిజియో థెరపీ వల్ల ఇంతకు ముందు కంటే ఇప్పుడు తన ఆరోగ్యం బాగుందని తెలిపారు.
''ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నా ఆరోగ్యం 100 శాతం బాలేదని చెప్పాను. ఆ తర్వాత మీరు నా మీద చూపించిన ప్రేమ, ఆందోళన.. నా హృదయానికి తాకింది. మళ్లీ నేను పూర్తి ఆరోగ్యంతో ఉండడానికి, కోలుకోవడానికి అవసరమైన శక్తిని 100 శాతం ఇచ్చింది. యోగ, స్విమ్మింగ్, ఫిజియో థెరపీ వల్ల ఇంతకు ముందు కంటే ఇప్పుడు నా ఆరోగ్యం బావుంది. జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల మెరుగ్గా ఉంది. సూర్యరశ్మి పొందడం కూడా ముఖ్యమే. అన్నిటి కంటే భగవంతుడి ఆశీర్వాదం ముఖ్యం'' అంటూ ఆయన ట్వీట్ చేశారు.
వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అంటే ఏమిటి?
మన చెవిలో బ్యాలెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఇదే వెస్టిబ్యులర్ సిస్టమ్. చెవిలోని అంతర్గత భాగం సరిగ్గా పనిచేయనప్పుడు లేదా పనిచేయడం పూర్తిగా ఆగిపోయినప్పుడు వెస్టిబ్యులర్ హైపో ఫంక్షన్ పరిస్థితి ఏర్పడుతుంది. మైకం కలగడం, కళ్లు తిరుగుతున్నట్టు అవ్వడం, వికారం వంటివి కలుగుతాయి.
వరుణ్ ధావన్ హీరోగా నటించిన 'బేడియా' ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో కృతి సనన్ హీరోయిన్. ఆ సినిమాలో రెండు పాటలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.