Ustaad Telugu Movie Review: చిత్రం: ఉస్తాద్; నటీనటులు: శ్రీసింహా కోడూరి, కావ్యా కళ్యాణ్ రామ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహ. రవి శివ తేజ, సాయి కిరణ ఏడిద తదితరులు; ఎడిటింగ్: కార్తీక్ కట్స్; సంగీతం: అకీవా.బి; ఛాయాగ్రహణం: పవన్ కుమార్ పప్పుల; రచన, దర్శకత్వం: ఫణిదీప్; నిర్మాతలు: రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు; విడుదల తేదీ: 12-08-2023
'మత్తువదలరా' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీసింహా కోడూరి తొలి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలేవీ ఆశించిన ఫలితాలను అందుకోలేదు. కానీ, వీటన్నింటితో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. తన సినిమాలతో వైవిధ్యాన్ని చూపించే ఈ స్టార్ ఇప్పుడు 'ఉస్తాద్'గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ ఉస్తాద్ కథేంటి? ఆడియెన్స్‌లో ఈ సినిమాకు ఏ మేర స్పందన వచ్చిందంటే..
కథేంటంటే: తన మనసుకు నచ్చింది చేసుకుంటూ వెళ్లే కుర్రాడు సూర్య (శ్రీసింహా). చిన్నప్పుడే తండ్రి మరణించడం వల్ల.. తల్లే (అను హాసన్) అన్నీ తానై పెంచి పెద్ద చేస్తుంది. సూర్యకు ఎత్తైన ప్రదేశాలంటే భయం. కానీ అతనికి విపరీతమైన కోపం ఉంటుంది. ఏ భావోద్వేగాన్నైనా అప్పటికప్పుడే చూపించేయడం తన నైజం. అసలు జీవితంపై ఏ స్పష్టతా ఉండదు. అయితే డిగ్రీ చదివే రోజుల్లో ఓ పాత కాలం నాటి బైక్‌ను ముచ్చటపడి కొనుక్కుంటాడు. దానికి ఉస్తాద్ అనే పేరు పెట్టుకుంటాడు. ఇక అది జీవితంలోకి వచ్చాక తన ఆనందం.. బాధ.. కష్టం.. సుఖం.. ప్రతిదీ ఆ బైక్‌తోనే పంచుకోవడం మొదలు పెడతాడు. ఆ బైక్ వల్లే మేఘన (కావ్యా కల్యాణ్ రామ్) సూర్య జీవితంలోకి వస్తుంది. వారిద్దరూ ప్రేమించుకుంటారు. ఇంతలోనే సూర్యకు పైలట్ అవ్వాలన్న లక్ష్యం ఏర్పడుతుంది. మరి ఎత్తైన ప్రదేశాలంటే భయపడే సూర్య పైలట్ అవ్వాలన్న తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు? ఈ క్రమంలో తనకెదురైన సవాళ్లేంటి? తన వ్యక్తిత్వం వల్ల ప్రేమకథలో వచ్చిన చిక్కులేంటి? వీటన్నింటినీ సూర్య ఎలా పరిష్కరించుకున్నాడు? ఈ ప్రయాణంలో ఉస్తాద్ అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? ఈ విషయాల గురించే మిగతా సినిమా..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎలా సాగిందంటే: సూర్య అనే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి జీవిత కథ ఇది. పాతకాలం నాటి ఓ బైక్ అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది.. ఎత్తైన ప్రదేశాలు చూస్తే భయపడే అతను ఆకాశంలో ఎగరాలని ఎందుకు అనుకున్నాడు? తన కలని నెరవేర్చుకునే క్రమంలో ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించాడు? అన్నదే ఈ సినిమా స్టోరీ. ఈ మొత్తం కథను మూడు దశల్లో తెరపై చూపించాడు దర్శకుడు. సూర్య కాలేజీ జీవితం.. మేఘనతో అతని ప్రేమ ప్రయాణంతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇక ఆకాశంలో ఎగరాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు సూర్య ఏం చేశాడు.. తన ప్రేమకథను ఎలా గెలిపించుకున్నాడన్న విషయాలను సెకెండ్ హాఫ్‌లో చూపించారు. ఈ మొత్తం కథను ఓ బైక్‌తో ముడిపెట్టి ఎమోషనల్‌గా చెప్పిన తీరు మెప్పిస్తుంది. అయితే చాలా నెమ్మదిగా సాగే కథనం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. సూర్య బాల్యం.. తండ్రితో ఉన్న అనుబంధాన్ని పరిచయం చేస్తూ సినిమాని ఆరంభించిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. అతను కాలేజీలోకి అడుగు పెట్టడం.. సీనియర్లు ర్యాగింగ్ చేయడం.. వాళ్లపై కోపంతో బైక్ నేర్చుకోవాలనుకోవడం.. ఈ క్రమంలో బండి నేర్చుకునేందుకు తను పడ్డ అవస్థలతో తొలి అరగంట సాగుతుంది. ఇదంతా సాగతీత వ్యవహారమే. మేఘనతో అతను ఎప్పుడైతే ప్రేమలో పడతాడో.. అక్కడి నుంచే కథలో కాస్త కదలిక మొదలవుతుంది. వీళ్లిద్దరి పరిచయం.. ఒకరినొకరు ఇష్టపడటం.. ఇద్దరూ కలిసి చేసే ప్రయాణమంతా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ లవ్ ట్రాక్‌ను ఎంతో సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
ఇక మధ్యలో ఉస్తాద్‌కు.. బైక్ మెకానిక్ బ్రహ్మంకు మధ్య వచ్చే ఎపిసోడ్స్ కూడా మనసుల్ని హత్తుకుంటాయి. సూర్యకు ఆకాశంలో ఎగరాలన్న లక్ష్యం ఏర్పడ్డాక కథ మరో మలుపు తిరుగుతుంది. ఇంటర్వెల్ సీన్స్ సెకెండ్ హాఫ్‌పై ఆసక్తి పెంచేలా ఉంటాయి. ఓవైపు సూర్య పైలట్ అవ్వడం కోసం ప్రయత్నాలు ప్రారంభించడం.. మరోవైపు మేఘన తన తండ్రి దగ్గర ప్రేమ విషయాన్ని బయటపెట్టడం.. ఒక్కసారిగా కథ రసవత్తరంగా మారుతుంది. మేఘన తండ్రితో సూర్య మాట్లాడే సన్నివేశాలు.. ఆ సందర్భంలో అతను పలికే సంభాషణలు యూత్‌ను తెగ ఆకట్టుకుంటాయి.
సూర్య - మేఘన లవ్ స్టోరీ సమస్యలు మొదలైనప్పటి నుంచి కథ కాస్త గాడి తప్పినట్లు అనిపిస్తుంది. మేఘన ప్రేమకు దూరమైన సందర్భంలో సూర్య పడే ఆవేదన.. ఆ సమయంలో అతని తల్లి స్ఫూర్తినింపే తీరు ఆకట్టుకుంటుంది. సూర్య పైలట్‌గా మారే తీరు.. ఈ క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించవు. పతాక సన్నివేశాలు గందరగోళానికి గురిచేస్తాయి. ముగింపు ఫర్వాలేదనిపిస్తుంది.
Ustaad Movie Cast : ఎవరెలా చేశారంటే: సూర్య పాత్రలో శ్రీసింహా చక్కగా ఒదిగిపోయారు. ఈ పాత్ర నటుడిగా తనని మరో మెట్టు పైకి ఎక్కించింది. ఆ పాత్రలోని మూడు కోణాల్ని ఆవిష్కరించడానికి సింహా తన శక్తిమేరకు కృషి చేశారు. ఎమోషనల్ సీన్స్‌లో తనదైన నటనతో కట్టిపడేశారు. మేఘన పాత్రలో కావ్యా కల్యాణ్ రామ్ ఎంతో సహజంగా కనిపించారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రిది. ఆ పాత్రను దర్శకుడు రాసుకున్న తీరు బాగుంది. ఆమెకు.. సింహాకు మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు చాలా సహజంగా ఉన్నాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటారు.
హీరో తల్లిగా అను హాసన్ తనదైన నటనతో కట్టిపడేస్తారు. ఆ పాత్రను కూడా దర్శకుడు చక్కగా తీర్చిదిద్దుకున్నారు. బైక్ మెకానిక్ బ్రహ్మం పాత్ర ప్రేక్షకుల మదిలో ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ఆ పాత్రను ముగించిన తీరు భావోద్వేగభరితంగా ఉంటుంది. గౌతమ్ మేనన్, వెంకటేష్ మహా ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. దర్శకుడు తన నిజ జీవితంలోని అనుభవాల ఆధారంగా ఈ కథను అల్లుకున్నారు. దాన్ని అనుకున్నట్లుగా నిజాయితీగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే కథను చాలా నెమ్మదిగా నడిపించడం.. సెకెండ్ హాఫ్ గాడి తప్పడం.. పతాక సన్నివేశాలు గందరగోళంగా ఉండటం వల్ల సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. కథలోని మహిళా పాత్రల్ని మలచిన తీరు మాత్రం ఎంతో మెప్పిస్తుంది. అకీవా పాటలు గుర్తుంచుకునేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అక్కడక్కడా మనసుల్ని హత్తుకుంటుంది. పవన్ కుమార్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- బలాలు
- + కథా నేపథ్యం
- + శ్రీసింహా, కావ్యా నటన
- + భావోద్వేగభరిత సన్నివేశాలు
- బలహీనతలు
- - నెమ్మదిగా సాగే కథనం
- - ముగింపు
- చివరిగా: ఓపికగా కూర్చోగలిగితే 'ఉస్తాద్' ప్రయాణాన్ని ఆస్వాదించొచ్చు.
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!