Priyanka Chopra UN Speech : ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సోమవారం జరిగిన ఐరాస సమావేశంలో ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆమె మాట్లాడారు. ప్రపంచానికి మునుపటికంటే ప్రస్తుతమే సంఘీభావం అవసరమని ఆమె వ్యాఖ్యానించారు. "సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ఏర్పరుచుకున్న గడువు సమీపిస్తోంది, ఇక ప్రపంచ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది" అని ప్రియాంక అన్నారు.
ప్రపంచంలో జరుగుతున్న కొన్ని కీలకమైన విషయాల గురించి ప్రియాంక ప్రస్తావించారు. కొవిడ్-19, వాతావరణ మార్పులు, పేదరికం లాంటి అంశాల గురించి ఆమె సమావేశంలో మాట్లాడారు. 'సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్' సాధించడానికి కేవలం ఎనిమిదేళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని గుర్తుచేశారు. 'న్యాయమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రపంచం' అనేది ప్రతి వ్యక్తి హక్కు అని అన్నారు.
"కొవిడ్‌తో అనేక దేశాలు ఇంకా పోరాడుతూనే ఉన్నాయి. ఈ సమయంలో వాతావరణ సంక్షోభం సైతం జీవితాలను మార్చేసింది, ఒకవైపు సంఘర్షణలు జరుగుతుండగా మరోవైపు పేదరికం, ఆకలి, అసమానతలు లాంటి అంశాలు మనం ఇన్నేళ్లు పోరాడి వేసిన పునాదిని నాశనం చేస్తున్నాయి." అని ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో తెలిపారు.
ఐక్యరాజ్యసమితి ప్రకారం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వల్ల పేదరికాన్ని నిర్మూలించవచ్చని, ఇందులో భాగంగా 17 లక్ష్యాల ప్రణాళికను 2015లో అన్ని ఐరాస సభ్య దేశాలు ఆమోదించాయి. రాబోయే 15 ఏళ్లలో వీటన్నింటిని సాధించడానికి కృషి చేయాలని, 2030 ఎజెండాలో భాగంగా ఈ 15 సంవత్సరాల ప్రణాళికను రూపొందించినట్లు ఐరాస తెలిపింది.
ఇదీ చదవండి: పొన్నియన్ సెల్వన్‌తో మరోసారి వార్తల్లో త్రిష