NTR Birthday Special : భూమి మీద పుట్టడానికి ప్రతి మనిషికీ ఏదో కారణం కచ్చితంగా ఉంటుంది. కానీ అందర్నీ కారణజన్ములు అని పిలవము. ఒక చర్రితకి లేకుంటే ఓ కొత్త శకానికి నాంది పలికేందుకు పుట్టినవాళ్లనే ఆ మాట అంటాం. అయితే అడుగుపెట్టిన రంగంలో చరిత్ర సృష్టించడం.. ఆ రంగంలో నవశకాన్ని నిర్మించడం ఆయనకి అలవాటైంది. ఉదాహరణకు సినిమా రంగాన్నే తీసుకుందాం.. ఆయన రాకముందు ఒకలా ఉండేది. ఆయనొచ్చాక మరొకలా మారింది. ఇప్పుడు మనం చూస్తున్న సినిమాలన్నీ ఆయన సృష్టించినవే. ఈ వీఎఫ్‌ఎక్స్‌లూ, బ్లూమ్యాట్లు, గ్రీన్మాట్లూ ఆయనకి తెలియకపోవచ్చు. తీసే విధానం మారచ్చేమో కానీ ఆయన నటన మాత్రం ఎప్పటికీ ఒకలానే ఉంటుంది. ఆయనే నందమూరి నట విశ్వరూపం ఎన్టీఆర్.
ఆయనకు భయం అనేది ఏంటో తెలియదు. అనుకున్నది సాధించడానికి ఎంతటి సాహసమైనా చేస్తాడు. అతని పేరు ఏదైనా సరే.. కానీ అసలు పేరు 'తోట రాముడు'. ప్రథమార్ధమంతా ఒకలా ఉంటూ.. ఇంటర్వెల్ సమయానికి పోలీసాఫీసర్లానో లేకుంటే, మాఫియా డాన్ లానో కనిపించాడంటే.. ఆ సినిమా పేరు 'అడవిరాముడు'. ఆ పాత్రల్ని సృష్టించింది ఆయన కాకపోవచ్చు. కానీ అంతటి సంచలన విజయాలను సాధించింది మాత్రం కచ్చితంగా ఎన్టీఆర్ వల్లనే.
ఆ పాత్రలను ఆయన పోషించి ఉండకపోతే అవి ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించేవి కావు, ఆ సినిమాలకు అంతటి విజయాలు వరించేవి కావు. ఆ నాగరికత వెండితెర మీద కొనసాగేది కాదు. అందుకే చలనచిత్ర రంగానికి ఆయన ఓ శకపురుషుడు. ఓ యుగ పురుషుడు.
అంతగా అందంగా లేని నటులు సైతం హీరో అంటే.. అందంగా ఉండి తీరాలన్న సిద్ధాంతంగా భావించే ఆ రోజుల్లో.. సహజంగా అందగాడైన ఎన్టీఆర్.. అసలు అందమేలేని 'పిచ్చి పుల్లయ్య'గా కనిపించి.. డీగ్లామరైజ్డ్ పాత్రను కూడా సునాయాసంగా చేసి ఆ పాత్రకే అందాన్ని తెచ్చారు. నిర్మాతగా అది ఆయన మొదటి సినిమా కూడా. కొత్తదనం కోసం పరితపించే ఆయన సృజనాత్మకతకి ఇంతకంటే మరో నిదర్శనం అక్కర్లేదు. పోనీ ఇతర భాషల నుంచి ప్రేరణ ఏమైనా ఉందా అంటే.. 'పిచ్చి పుల్లయ్య' రావటానికి ముందు భారతీయ సినిమా మొత్తం హీరోలు అందంగానే ఉండాలన్న సిద్ధాంతంతోనే నడిచింది. మహా అయితే అందగాడైన హీరో శాపం కారణంగా అందవిహీనంగా మారి మళ్లీ శాపవిమోచనమై అందగాడవుతాడు.. తప్ప సహజంగా అందంలేని పాత్ర హీరో కావటానికి ఒప్పుకునేవాళ్లు కాదు. కానీ ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోవడమే కాకుండా ఆ సూత్రాన్ని ఆచరించి చూపించారు. తర్వాతి తరానికి ఆదర్శమయ్యారు.
ఇక్కడ క్యారెక్టర్లే హీరోలు..
NTR Movies : 'తోడుదొంగలు' సినిమాలోని ముసలి పాత్ర, 'రాజూపేద'లోని అందవిహీనుడి పాత్ర, 'కలిసి ఉంటే కలదు సుఖం'లోని వికలాంగుడి పాత్ర.. ఇంకా చెప్పుకుంటూ పోతే 'గుండిగంటలు', 'చిరంజీవులు', 'ఆత్మబంధువు', 'బడిపంతులు'... ఇలా 1977లో 'అడవిరాముడు' వచ్చేదాకా.. ఆయన నటించిన 300లకు పైగా సినిమాల్లో 75 శాతం ప్రయోగాలే. వాటిల్లో రీమేకులు కూడా ఉన్నాయి. అయితే అలాంటి పాత్రల్ని సైతం హీరోల్ని చేసి వేరే భాషలకు కూడా ఆదర్శంగా నిలిచిమన 'పిచ్చిపుల్లయ్య', 'తోడుదొంగలు', 'రాజూ పేద'.. ఈ మూడు అచ్చ తెలుగు సినిమాలు. అంతే కాకుండా మొదటి రెండూ ఎన్టీఆర్ సొంత సినిమాలు.
ఒక సినిమాలో అందం, ధీరత్వం ఏ మాత్రం లేని వ్యక్తి హీరో అయితే.. రెండో సినిమాలో ముసలివాడు పైగా దుర్మార్గుడైన వ్యక్తిని కథానాయకుడిగా చేశారు. 'కన్యాశుల్కం'లో గిరీశం అసలు హీరో కాదు. హీరోలెవరూ ఆ పాత్ర చేసేందుకు సాహసం చేయలేదు. చేయనన్నారు కూడా. కానీ ఎన్టీఆర్ ఆ పాత్ర చేశారు కాబట్టి గిరీశం హీరో అయ్యాడు. ఆయన హీరో పాత్రలు చేసే నటుడు మాత్రమే కాదు.. పాత్రల్ని హీరోలను చేసే మహానటుడు. కథకి నాయకుడైతే ఎవరైనా కథానాయకుడే. అది నిరూపించింది కూడా ఆయనే. గిరీశం లాంటి వాడిని కూడా హీరోని చేసింది ఆయనే.
పౌరాణికాల రారాజు
NTR In Narthanasala : ఈయన నటించిన పౌరాణికాలూ, జానపదాలూ, చారిత్రకాల గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరంలేదు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో పురాణాల గురించి తెలిసినవాళ్లు తెలుగు నేల మీద ఎక్కువ. కారణం ఇక్కడ నిరక్షరాస్యులు కూడా పురాణాల మీద చర్చలు పెడతారు. వాళ్లకి అక్షరజ్ఞానం లేకపోయినా కూడా ఎన్టీఆర్ పౌరాణికాలు ఇచ్చిన జ్ఞానం వారి దగ్గర బోలెడు ఉంది. వాళ్లకి రాముడైనా ఆయనే.. రావణాసురుడు అయినా ఆయనే. కృష్ణుడూ ఆయనే.. దుర్యోధనుడూ ఆయనే. కర్ణుడు, అర్జునుడు, భీముడు అని కూడా పిలుస్తుంటారు.
అయితే ఈ భూమ్మీద 'బృహన్నల' అనే పాత్రను ఆయన తప్ప మరెవ్వరూ పోషించలేరూ.. ప్రయత్నించినా పండించలేరు కూడా. అలాగే భీష్ముడిలా ఎవ్వరూ నటించలేరూ... నటించినా న్యాయం చేయలేరూ. అసలెవ్వరూ భీష్ముణ్ని హీరోని చేసి ఎరుగరు.
దానవీరశూరకర్ణ ఎన్టీఆర్‌కే సాధ్యం
NTR Dana Veera Soora Karna: ఎన్టీఆర్ సినీ ప్రస్థానంలో 'దానవీరశూరకర్ణ'కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలోనే అంతకుముందుగానీ.. ఆ తరవాతగానీ ఎవ్వరూ చేయనీ, చేయలేని ఓ అద్భుతం ఆ సినిమా. కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు.. ఇలా పొంతనలేని మూడు పాత్రలను ఒక సినిమాలో ఒక్కడే పోషించటంతోప అనేది చెప్పుకోవాల్సిన విషయమే. అంతే కాకుండా ఆ సినిమాకి దర్శకుడు, నిర్మాత కూడా తానే అవడం.. 25 రీళ్లున్న సినిమాలో ఒకటి రెండు సీన్లలో తప్ప ప్రతి సీన్‌లోనూ ఆయనే కనిపించడం, ఒక్క ఎన్టీఆరే కనిపించే సీన్లు తక్కువ ఉండటం, ఇద్దరు ఎన్టీఆర్‌లూ, ముగ్గురు ఎన్టీఆర్‌లూ ఉన్న సీన్లే ఎక్కువగా ఉండటం- ఇలా ఈ సినిమాలో ఆయనకి మాత్రమే సాధ్యమైన విశేషాలు ఎన్నో మరెన్నో.
ఇప్పటి కాలంలో ఆడియన్స్ రెండున్నర గంటల సినిమాని కూడా ఆసక్తిగా చూడలేకుంటున్నారు. కానీ నాలుగ్గంటల ఏడు నిమిషాల నిడివి ఉన్న 'దానవీరశూరకర్ణ'ను మాత్రం ఇప్పుడు టీవీలో వచ్చినా.. ఛానల్ మార్చకుండా చూస్తున్నారంటే అది కేవలం ఎన్టీఆర్‌లోని కళాకారుడి ప్రతిభకు నిదర్శనమే.