Nikhil Spy Review : చిత్రం: స్పై; నటీనటులు: నిఖిల్, ఐశ్వర్య మేనన్, జీసు సేన్‌గుప్తా, అభినవ్, మకరంద్ దేశ్ పాండే, ఆర్యన్ రాజేశ్, నితిన్ మెహ్తా, రానా (అతిథి పాత్రలో..), తదితరులు; కథ: కె.రాజశేఖర్ రెడ్డి; సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్; సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్; నిర్మాణ సంస్థ: ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్; నిర్మాత: కె.రాజశేఖర్ రెడ్డి; దర్శకత్వం: గ్యారీ బీహెచ్; విడుదల తేదీ: 29-06-2023
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ చేసిన 'కార్తికేయ 2' పాన్ ఇండియా లెవెల్లో మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఆ ఇమేజ్‌కి తగ్గట్టుగానే ప్రస్తుతం ఆయన తదుపరి సినిమాల ప్రయాణం కొనసాగుతోంది. అందులో భాగంగానే తాజాగా 'స్పై' మూవీ తెరకెక్కింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుకున్న రహస్యాన్ని స్పృశిస్తూ.. ఓ గూఢచారి కథతో రూపొందిన సినిమా ఇది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..
కథేంటంటే: జైవర్ధన్ (నిఖిల్) ఓ రా ఏజెంట్. శ్రీలంకలో పనిచేస్తుంటాడు. భారతదేశంపై దాడి ప్రయత్నాల్లో ఉన్న ఉగ్రవాది ఖదీర్ ఖాన్ మృతిచెందాడని అందరూ భావిస్తాడు. కానీ అతడి నుంచి నష్టం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. దీంతో ఖదీర్ ఆచూకీ కోసం ప్రత్యేకమైన మిషన్‌తో జై రంగంలోకి దిగుతాడు. మరి ఖదీర్ దొరికాడా? లేక అందరూ ఊహించినట్టుగానే మృతిచెందాడా? ఈ ప్రయత్నంలో ఉన్న జై తన అన్న సుభాష్ (ఆర్యన్ రాజేశ్)ని చంపినవాళ్లని ఎలా కనుక్కున్నాడు? ఈ మిషన్‌కి ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ అదృశ్యం వెనకున్న రహస్యానికీ సంబంధం ఏమిటనేది మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే: అత్యంత రహస్యమైన కథతో రూపొందిన సినిమాగా 'స్పై' ప్రచారమైంది. నేతాజీ అదృశ్యం అనే అంశం కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కానీ మూవీ మాత్రం ఏ దశలోనూ ఆ స్థాయిని అందుకోలేకపోయింది. అంతర్జాతీయ స్థాయి, దేశభక్తితో ముడిపడిన ఇలాంటి గూఢచారి కథలకి కథనం, ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్లింగ్ అంశాలు, భావోద్వేగాలు బలంగా ఉండాలి. అవి లేకపోతే కథ ఎన్ని దేశాలు చుట్టొచ్చినా వృథానే అవుతుంది. ఆ విషయాన్ని ఈ సినిమా మరోసారి రుజువు చేస్తుంది. దేశానికి ముప్పుగా మారిన ఓ కరడుగట్టిన ఉగ్రవాది, అతడిని మట్టుబెట్టేందుకు చేపట్టే ఓ మిషన్, అందులో హీరో.. ఇలా చాలా సినిమాల్లో చూసినట్టే రొటీన్ ఫార్ములాతో ఫస్ట్ హాఫ్‌లోని సన్నివేశాలు సాగిపోతాయి.
ఇక సెకెండ్ హాఫ్‌లో మేకర్స్ ఏమైనా మేజిక్ చేశారా అంటే.. అక్కడ కూడా నిరాశే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫైల్ చుట్టూ సాగే కొన్ని సన్నివేశాలు, ఆయన పోరాట స్ఫూర్తి నేపథ్యం మినహా ఎక్కడా సినిమా ఆసక్తిని రేకెత్తించే అంశాలు లేకుండా పోయింది. సెకెండ్ హాఫ్‌లో కొత్త విలన్, రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం, బోలెడన్ని పోరాట ఘట్టాలు.. ఇలా చాలా హంగామా తెరపై కనిపిస్తుంటుంది కానీ, ఎక్కడా ప్రేక్షకుడిని కట్టిపడేసే సన్నివేశాలు ఉండవు. రచన, దర్శకత్వంలోనే లోపాలు కనిపిస్తాయి. కథానాయకుడి సోదరుడి మరణం వెనక రహస్యం, నేతాజీ ఫైల్.. ఇలా కథలో పలు పార్శ్వాలున్నా వాటిని సమర్థంగా నడిపించి ప్రేక్షకులకి థ్రిల్‌ని పంచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. వీటి వల్ల ఈ సినిమా ఓ సాదాసీదా ప్రయత్నంలా అనిపిస్తుంది.
Spy Movie Cast: ఎవరెలా చేశారంటే: హీరో నిఖిల్‌ని ఈ సినిమాలో కొత్తగా చూపించిందేమీ లేదు. ఆయన వేషం, హావభావాల్లోనూ చెప్పుకోదగ్గ మార్పులైతే కనిపించలేదు. పోరాట ఘట్టాల కోసమైతే ఆయన బాగా శ్రమించారు. అభినవ్ గోమటం తన సంభాషణలతో అక్కడక్కడా నవ్వించగలిగాడు. ఇక హీరోయిన్లు ఐశ్వర్య మేనన్, సానియా అందంతోనూ, అభినయంతోనూ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు.
ఆర్యన్ రాజేశ్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, సచిన్ ఖేడేకర్ తదితర నటులు సినిమాలో కనిపించినప్పటికీ.. ఆ పాత్రలు ఏ రకంగానూ ప్రభావం చూపించవు. రా అధికారిగా మకరంద్ దేశ్‌పాండే నటనలో సహజత్వం కనిపించదు. నితిన్ మెహతా, జిష్షూసేన్ గుప్తా ప్రతినాయక పాత్రల్లో కనిపిస్తారు. ఆ పాత్రల్లో బలం లేదు. రానా అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. సాంకేతిక విభాగాల్లో కెమెరా, సంగీతం ప్రభావం చూపించాయి. దర్శకుడిగా గ్యారీ పనితనం అంతంత మాత్రమే అయినా ఎడిటర్‌గా ఈ సినిమాని పక్కా కొలతలతో మలిచారు. రచన కూడా పేలవంగానే ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బలాలు
+ నేతాజీ నేపథ్యంలో సన్నివేశాలు
+ కొన్ని యాక్షన్ ఘట్టాలు
బలహీనతలు
- ఆసక్తి రేకెత్తించని కథనం
- కొరవడిన భావోద్వేగాలు
చివరిగా: అంచనాలు అందుకోలేని...'స్పై'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!