ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్‌కు అడుగుదూరంలో నిలబడంపై భారతీయ చిత్ర పరిశ్రమ ఉప్పొంగిపోతోంది. నాటు నాటు పాట తుది జాబితాలో చోటు దక్కించుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నాటునాటు పాటకు తన హృదయంలో ఎప్పటికి ప్రత్యేక స్థానం ఉంటుందని ఎన్టీఆర్ పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఆస్కార్‌కు నామినేట్ అవడం దేశానికే కాదు తనకూ గొప్ప అనుభూతిని కలిగించిందని చరణ్ ట్వీట్ చేశారు. నాటు నాటు పాట నామినేట్ కావడం పట్ల చిత్ర బృందమంతా అవార్డుకు అర్హులం అనిపించుకున్నామని చరణ్ తెలిపారు.
నాటునాటు పాటకు నృత్యరీతులు సమకూర్చిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఆ పాటకు ఆస్కార్ వేదికపై తారక్, చరణ్‌లు డ్యాన్స్ చేస్తారని, తన ఆనందానికి అవధులు లేకుండా పోయానని తెలిపారు. అడుగు దూరంలో ఉన్న ఆస్కార్ ఆర్ఆర్ఆర్ చేతికి అందేలా అందరూ ప్రార్థించాలని, కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష మార్చి 12న నెరవేరుతుందని మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.
"నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం ఆనందదాయకం. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి నా అభినందనలు. ఆల్ దట్ బ్రీత్స్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్ర బృందాలకు అభినందనలు"
-- హీరో నందమూరి బాలకృష్ణ
"నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ ఆనందంగా ఉంది. సినిమా వల్లే నా పాట ఆస్కార్ వరకు చేరింది. నాటు నాటును ఆదరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్, రామ్‌చరణ్ నాటు నాటు పాటకు డ్యాన్స్ చేయాలి."
--ప్రేమ్ రక్షిత్ మాస్టర్
"ఇక నాటు దెబ్బ డైరెక్ట్‌గా ఆస్కార్‌కే. తారక్, చరణ్‌తోపాటు ప్రపంచం మొత్తాన్ని కీరవాణీ నాటునాటు వేయించారు. నాటునాటు పాటలో భాగస్వాములైన ప్రతిఒక్కరికి అభినందనలు" అని హీరో రవితేజ తెలిపారు. "నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం అద్భుతం. సినిమా సిగలో మరో కలికితురాయి. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి నా అభినందనలు" అని హీరో వెంకటేశ్ చెప్పుకొచ్చారు. టాలీవుడ్ నటీనటులు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులంతా ఆనందం వ్యక్తం చేస్తూ ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.