రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా చిత్రం 'ది వారియర్'. జూలై 14న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో.. మీడియాతో మాట్లాడాడు రామ్. చిత్రానికి సంబంధిన పలు విషయాలను వెల్లడించాడు.
- సడెన్‌గా పోలీస్ రోల్‌లో కనిపించారు కారణమేంటి?
రామ్: అసలు పోలీస్ కథలపై నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒకప్పుడు చేద్దామనుకున్నా. రొటీన్ స్టోరీలు వచ్చేసరికి బోర్ కొట్టి వద్దనుకున్నాను. లింగుస్వామి వచ్చి కథ చెప్పడానికి ముందు పోలీస్‌స్టోరీ అనేసరికి షాక్ అయ్యా. సరే కథ విని నో చెప్పేద్దామనుకున్నాను. కానీ, ఆయన చెప్పిన కథ నాకే ఎనర్జీ ఇచ్చింది. నేను ఎదురుచూస్తున్న రోల్ ఇదేనని ఓకే చెప్పేశా.
- రెగ్యులర్ పోలీస్ కథలకి భిన్నంగా ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారు?
రామ్: ఇది రియల్ స్టోరీ నుంచి స్ఫూర్తి పొందిన కథ. నాకు దర్శకుడు కథ చెప్పడం పూర్తయ్యాక, ఈ విషయం చెప్పడంతో ఆశ్చర్యపోయా. ఇంత పవర్‌ఫుల్ రోల్‌ని ఇంకా థ్రిల్లింగ్‌గా డిజైన్ చేశారు లింగుస్వామి. ఎంతలా అంటే స్టోరీ చెప్పిన అరగంటకే మా ఇంటికి పోలీస్ యూనిఫామ్ రప్పించుకున్నా. యూనిఫామ్ ఒంటిపై పడగానే ఏదో పవర్ ఉందనిపించింది.
- విలన్‌గా చేసిన ఆది పినిశెట్టి పాత్ర ఎలా ఉంటుంది?ఆయన్ని ఎవరు ఎంపిక చేశారు?
రామ్: స్టోరీ వినగానే గురు(విలన్ రోల్) పాత్ర ఎవరు చేస్తున్నారు?అని ఆసక్తిగా అడిగాను. సినిమాకి చాలా బలమైన రోల్ అది. 'ఆది పినిశెట్టి'(Aadi Pinisetty) అనగానే సూపర్ అనుకున్నాను. ఆది కూడా చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. అతనూ ఈ స్క్రిప్టు వినగానే రెడీ అన్నాడట.అది స్టోరీకున్న బలం.
- మీ సినిమాని థియేటర్‌లో విడుదల చేస్తున్నారు.. ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్ అనిపించట్లేదా?
రామ్: తెలుగు ప్రేక్షకులు సినిమాను బాగా ప్రేమిస్తారు. కరోనా తరువాత కూడా థియేటర్లని నిలబెట్టింది మనవాళ్లే. థియేటర్లో చూడాలనుకునే సినిమాని అక్కడ చూడటానికే ఇష్టపడతారు. వారికి నచ్చితే భారీ విజయాన్ని అందిస్తారు. 'ఆర్‌ఆర్‌ఆర్', 'సర్కారు వారి పాట' విజయాలే అందుకు నిదర్శనం. ఇప్పుడు ఈ సినిమాని థియేటర్‌లో చూడటానికే వారు ఇష్టపడతారు. ఈ సినిమాలో ప్రతి సీన్ థియేటర్లో ఎంజాయ్ చేసే రేంజ్‌లో ఉంటుంది.
- సినిమా షూటింగ్ దశలో ఉండగా మీకేదో ఆరోగ్య సమస్య వచ్చిందట?
రామ్: అవును.. జిమ్‌లో ఎక్కువ సమయం గడపటం వల్ల శరీరంలో గాయమైంది. వెన్నెముకకు చిన్న సర్జరీ జరిగింది. ఒక్కసారిగా షూటింగ్‌కి బ్రేక్. ఆ సమయంలోనే ఆది పెళ్లి కూడా. ఇంకెంత కాలం విశ్రాంతి తీసుకోవాలి, షూటింగ్‌కి అటెండ్ అవ్వాలని డాక్టర్‌ని అడిగా. ఆయన 'మీకు సినిమా ముఖ్యమా?జీవితం ముఖ్యమా' అని అడిగారు. ఆలోచించుకుంటే సినిమానే జీవితం అనిపించింది. అందుకే ఇలా వచ్చేశాను. ప్రస్తుతం ఏ సమస్యా లేదు.
- ఈ మధ్య సోషల్‌మీడియా ద్వారా పబ్లిక్ విషయాల్లో ఎక్కువగా స్పందిస్తున్నారు?
రామ్: అవునండీ. స్పందించాలి కదా! ముఖ్యంగా కచ్చితంగా చెప్పాల్సిన విషయంలో చెప్పి తీరాలి. అందుకే స్పందిస్తున్నా.
- హీరోయిన్‌గా కృతిశెట్టిని తీసుకున్నారు? దానికి కారణం?
రామ్: ఆమె చాలా కష్టపడుతుంది. సినిమా అంటే అభిమానం.. గౌరవం. అందువల్లే ఈ రోల్‌కి సెలెక్ట్ చేశారు. ఈ సినిమాలో ఆమె పాత్ర అద్భుతంగా ఉంటుంది.
- దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, శింబుతో పాట పాడించడం ఇవన్నీ సినిమాకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి?
రామ్: దేవీతో ఇది అయిదో సినిమా. తనతో నా ప్రతీ సినిమా మ్యూజికల్ హిట్టే. ఇప్పుడు ఈ సినిమా పాటలు అదే స్థాయిలో వినపడుతున్నాయి. తమిళ్ లో అయితే బులెట్ సాంగ్ ట్రెండ్ కొనసాగుతోంది. శింబు వాయిస్‌లో ఒక అట్రాక్షన్ ఉంటుంది. అది కూడా ఆ పాటకు ఎనర్జీ ఇచ్చింది.
- తరువాత సినిమా బోయపాటితో కదా? పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట?
రామ్: అవును. అది పాన్ ఇండియా సినిమానే. బోయపాటి సినిమాను చాలా శ్రద్ధ పెట్టి తీస్తారు. ప్రతీ సన్నివేశాన్ని బాగా గమనిస్తారు. ఇక పాన్ ఇండియా లెవెల్లో అంటే ఇంకా బాగా తీస్తారని ఆయనపై నమ్మకం.
- ఈ మధ్యకాలంలో మీ పెళ్లిపై రూమర్లు ఎక్కువయ్యాయి..దీనికి మీ సమాధానం?
రామ్: అవును(నవ్వుతూ..) ప్రస్తుతం దానిపై ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఈ మధ్య రూమర్లపై రెస్పాండ్ అవ్వడానికి కారణం అదే. నేనసలు స్కూలుకే సరిగ్గా వెళ్లలేదు. ఇక స్కూల్ గర్ల్‌ఫ్రెండ్ ఎక్కడుంటుంది?
- ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేస్తున్నారు?మళ్లీ లవ్‌స్టోరీలెప్పుడు?
రామ్: ప్రస్తుతం యాక్షన్ సినిమాలే ఎక్కువగా కిక్కిస్తున్నాయి. మళ్లీ లవ్‌స్టోరీలు చేయాలనిపించినపుడు అవీ చేస్తాను. 'వారియర్' తర్వా బోయపాటి సినిమాపైనే దృష్టి పెట్టా. హరీశ్ శంకర్, అనిల్ రావిపూడితో సినిమాలు ఇంకా చర్చల దశల్లో ఉన్నాయి.
ఇదీ చదవండి: 'అక్డీ పక్డీ' సాంగ్ కొరియోగ్రఫీ సమయంలో ఏడ్చేశాను: విజయ్ దేవరకొండ