ప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి (78) చెన్నైలోని తన నివాసంలో శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన విజయవాడలోని మొగల్రాజపురంలో 1944 జూన్ 14న భవానీ శంకర్‌రావు, అనసూయమ్మ దంపతులకు జన్మించారు. బిషప్ హాజరయ్య పాఠశాలలో ప్రాథమిక విద్య, బాపట్లలోని సాల్వేషన్ ఆర్మీ హైస్కూల్‌లో యస్‌యస్‌ఎల్‌సీ వరకు చదివారు. అనంతరం విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ పూర్తి చేశారు. వరంగల్, హైదరాబాద్‌లో వైద్య విద్య అభ్యసించారు. చిన్నతనం నుంచే సంగీతం, సాహిత్యాలపై మురారికి ఆసక్తి ఎక్కువ. త్రిపురనేని గోపీచంద్, దేవులపల్లి కృష్ణశాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు, చక్రపాణి అనువాదం చేసిన శరత్ చంద్రుని రచనలంటే బాగా ఇష్టం. ఎంబీబీఎస్ చదివే రోజుల్లో సినిమాలు ఎక్కువగా చూసి వాటిపై సమీక్షలు, వ్యాసాలు రాసేవారు. 'వినీల' ఆయన కలం పేరు.
చదువుకు బ్రేక్ పెట్టి.. సినిమాలకు తలుపులు తెరచి
ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడే చిత్రపరిశ్రమలో ప్రవేశించాలనే కోరికతో చదువుకు స్వస్తి చెప్పేశారు. తన పినతండ్రి శ్రీనివాసరావు ప్రోత్సాహంతో దర్శకుడు మధుసూదనరావు దగ్గర 1969లో సహాయదర్శకుడిగా చేరారు.'మనుషులు మారాలి' చిత్రానికి తొలిసారిగా పని చేశారు. ఆ సమయంలోనే జెమినీ వాసన్‌తో ఏర్పడిన పరిచయంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. తరువాత వీనస్‌లో పవిత్రబంధం, మంచివాడు, అత్తా ఒకంటి కోడలు సినిమాలకు పని చేశారు.
చక్రపాణి పరిచయం టర్నింగ్ పాయింట్
ఆ తర్వాత రామానాయుడు ఆధ్వర్యంలో దగ్గుబాటి భాస్కరరావు నిర్మించిన 'ప్రేమలు-పెళ్లిళ్లు' షూటింగ్ సమయంలో దర్శకుడు చక్రపాణి పరిచయమయ్యారు. అదే సమయంలో తాపీ చాణక్య హఠాత్తుగా మరణించడంతో వారు తీస్తున్న 'గంగ-మంగ'కు పని చేయమన్నారు చక్రపాణి. అక్కడి నుంచి మురారీ దశ, దిశ మారిపోయాయి. ఆయన కార్యదర్శిగా ఉంటూ అన్ని విభాగాల్లో అనుభవం గడించారు. వి.మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావు, బాలచందర్, సేతుమాధవన్, బాపు తదితర దర్శకుల దగ్గర సహాయదర్శకుడిగా పని చేశారు. అనంతరం కొత్తగా 'యువ' పేరిట సంస్థను స్థాపించి సీతామాలక్ష్మి (1978), గోరింటాకు (1979), త్రిశూలం (1983), అభిమన్యుడు (1984), సీతారామ కల్యాణం (1986), శ్రీనివాస కల్యాణం (1987),జానకిరాముడు (1988), నారీనారీ నడుమ మురారి (1990) తదితర చిత్రాలు నిర్మించారు.మురారి తన సినిమాల్లో సంగీత, సాహిత్యాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర,వేటూరి సుందరరామమూర్తి, ‘సిరివెన్నెల’ సీతారామాశాస్త్రి తదితర రచయితలందరూ యువ సంస్థకు పాటలు రాశారు.