ఆయన పేరు కోడూరి విజయ అప్పారావు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఆయనది రైతు కుటుంబమే కానీ.. బాగా చదువుకున్నవారు. బ్రిటిష్‌వాళ్ళ కాలంలో 'క్లాస్ వన్' కాంట్రాక్టరు. అప్పట్లోనే ఈ ప్రాంతంలో పన్నెండు బస్సులు నడుపుతుండేవారు. ఆయనకి కళలంటే మక్కువ ఎక్కువ. కళాకారుల్ని ఎంతో ప్రోత్సహించేవారు. ఆ వాతావరణంలో పెరిగిన అప్పారావు రెండో కొడుకు 'కళలేనిదే నా జీవితం లేదు' అనుకున్నాడు. ఆ చిన్నారికి తండ్రి పెట్టిన పేరు సుబ్బారావు. ఊహ వచ్చాక ఆ పేరు నాజూగ్గాలేదని బాబూరావని మార్చుకున్నాడతను! పదిహేనేళ్ళు వచ్చాక మద్రాసు వెళ్ళి చిత్రలేఖనం కాలేజీలో చేరతానని తండ్రికి చెప్పాడు. ఆయన ఒప్పుకోలేదు. 'కళ జీవితంలో ఒక భాగమే తప్ప.. అదే జీవితం కాకూడదు. అది తిండిపెట్టదు' అన్న భావన ఆ తండ్రిది. కొడుకు వినలేదు. దాంతో- కొడుకుని చదువు మాన్పించేసి తన బస్సుల్ని తనిఖీ చేసే పని అప్పగించాడు. దాంతో- ఓ రోజు ఇంట్లో ఎవరితోనూ చెప్పకుండా ముంబయి వెళ్ళిపోయాడు. అక్కడి 'జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్'లో చేరాడు. రెండేళ్ళ తర్వాత డిప్లొమాతో సొంతూరు వచ్చి తన చిత్రలేఖనంతో అందర్నీ అబ్బురపరిచాడు. 'కమలేష్' అన్న కుంచె పేరుతో చిత్రాలు గీయడం ప్రారంభించిన బాబూరావు తన పేరుని 'శివదత్త'గా మార్చుకున్నాడు! తరతరాల రైతుకుటుంబాన్ని ఎన్నో కష్టనష్టాలకోర్చి కళలవైపు నడిపించిన ఆయనే.. మరకతమణి కీరవాణి తండ్రి!
బతికి.. చితికారు!
శివదత్త కుంచెకే పరిమితమైతే తెలుగురాష్ట్రం గర్వించే చిత్రకారుడిగా రాణించి ఉండేవారేమోకానీ.. ఆయన దృష్టి ఆ ఒక్కదానికే పరిమితం కాలేదు. సంగీతంపైనా పడింది. గిటార్, సితార్, హార్మోనియం నేర్చుకున్నారు. వాటితోపాటూ కథలూ, కవితలంటూ సాహిత్యంలోనూ ప్రవేశించారు. సినిమాలపైనా ఆసక్తితో ఎల్వీప్రసాద్ దగ్గర సహాయకుడిగా చేసి తిరిగి వచ్చేశారు. అలా తిరిగొచ్చిన శివదత్తకి భుక్తికోసం ఏదో ఒకటి చేయక తప్పని స్థితి ఎదురైంది. తండ్రి అప్పారావుకి వ్యాపారాల్లో నష్టాలొచ్చి.. ఆర్థిక పతనం మొదలైంది.
శివదత్తకి తోబుట్టువులు ఆరుగురు. ఓ అన్న, అక్క, నలుగురు తమ్ముళ్ళు. అక్కయ్య పెళ్ళికావడం, అన్నయ్య కుటుంబం నుంచి వేరుపడటంతో శివదత్తే ఇంటికి పెద్దయ్యారు. ఆ తమ్ముళ్లలో ఒకడు చంద్రబోస్ సంగీత దర్శకురాలు శ్రీలేఖ వాళ్ళ నాన్న. చివరివాడు ఎస్‌ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. అన్నదమ్ములు కలిసి చేసిన వ్యాపారాలేవీ కలిసిరాలేదు. దాంతో వ్యవసాయంపైన దృష్టిపెట్టారు. అప్పట్లో గోదావరి జిల్లాల రైతు కుటుంబాలు కొన్ని కర్ణాటకలో రాయచూరు దగ్గర్లోని అమరేశ్వర క్యాంప్ దగ్గర భూములు కొని వ్యవసాయం చేస్తుండేవి.
శివదత్త కూడా కొవ్వూరులోని తన పొలాల్ని అమ్మి అక్కడ చేరారు. వీణావాయిద్యం తెలిసిన భానుమతిని ఏరికోరి పెళ్ళి చేసుకున్నారు. 1961లో ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఓసారి శివదత్త మద్రాసులో సంగీతదర్శకుడు ఎస్.రాజేశ్వరరావుని కలిశారట. 'విప్రనారాయణ' సినిమాలో తనకెంతో ఇష్టమైన 'ఎందుకోయీ తోటమాలీ..' పాట ఏ రాగంలోనిదని అడిగారట. 'కీరవాణి' అన్నారట రాజేశ్వరరావు. తన కొడుక్కి ఆ రాగం పేరే పెట్టారు. దానికి ముందు మరకతమణి (పచ్చ రాయి)నీ చేర్చారు. శివదత్త రాయచూరులో ఉండటం వల్ల కీరవాణి మూడేళ్ళపాటు కొవ్వూరులో- తన చిన్నాన్న చంద్రబోస్ ఇంటే పెరిగాడు. నాలుగో ఏట రాయచూరు వెళ్ళాడు. అక్కడ అమ్మ వీణావాదన వింటూ తండ్రి వేలుపట్టుకుని సంగీతం వైపు తొలి అడుగులేశాడు.
తండ్రే తొలి గురువు
'దేవుడి దర్శనం కోసం కొండపైకి వెళ్ళాలంటే మెట్లెక్కాలి. కానీ మనల్ని భగవంతుని వద్దకు చేర్చే మెట్లు మాత్రం దేవుణ్ని ఎప్పుడూ చూడలేవు. మా నాన్న నాకు ఆ మెట్లలాంటివారు! ఆయన తన ప్రతిభకి తగ్గ విజయాలు అందుకోలేకపోయినా మాకు పునాదిరాయిగా నిలిచారు' అంటారు కీరవాణి! ఆ మాటలు అక్షరసత్యాలు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే కీరవాణి సంగీతం నేర్చుకోవాలని పట్టుబట్టారు శివదత్త. 'చివరకు మిగిలేది' సినిమాలోని 'చిన్నారీ.. నీ మనసే' పాటని తానే నేర్పించి తొలి గురువయ్యారు. కవిటప్ప సీతన్న అన్న విద్వాంసుడి దగ్గర వయోలిన్ నేర్పించారు.
ఆ శిక్షణ ఏడాదే సాగినా అది కీరవాణిమీద బలమైన ముద్రవేసింది. సంగీతం కాస్తోకూస్తో ఒంటపట్టడంతో రేడియోలో విన్న ప్రతి పాటకి సంబంధించిన రాగచ్ఛాయల్నీ పట్టుకోసాగాడు. ఆరేళ్ళ తర్వాత కీరవాణి రాయచూరుకి వెళ్ళినప్పుడు అక్కడ దత్తప్ప అనే విద్వాంసుడి దగ్గర సంగీతం అభ్యసించాడు. హిందూస్థానీ సంగీతాన్ని పరిచయం చేసుకున్నదీ ఆ సమయంలోనే. కఠోరసాధన చేసి వయోలిన్‌పైన పట్టుసాధించాడు. కాకినాడకి చెందిన ఎన్.జె.ప్రాణలింగం ఆర్కెస్ట్రా వాళ్ళు కీరవాణిని తమ ట్రూప్‌లో చేర్చుకున్నారు. ఇంటర్‌కి వచ్చాక మంచి ఉద్యోగం రావాలంటే కళని పక్కనపెట్టక తప్పదనుకున్నాడు.
ఇంజినీర్ కావాలని పరిశ్రమించాడు కానీ సీటు రాలేదు. కీరవాణీ, వాళ్ళమ్మా, బాబాయిలూ అందరూ 'ఇలా జరిగిందేమిటీ?' అని బాధపడుతుంటే వాళ్ళ నాన్న శివదత్త మాత్రం చాలా సంతోషించారట! 'చదువుని పక్కన పెట్టు. అది కూడు పెట్టదు. నీకు దేవుడిచ్చిన సంగీత జ్ఞానం ఉంది. దాన్ని మెరుగుపర్చుకో' అన్నారట! అనడమే కాదు- ఆ రోజు నుంచి తాను పాటలు రాస్తూ కీరవాణిని బాణీలు కట్టమన్నారు. ఆ సాధన కొన్నేళ్ళపాటు సాగింది. భవిష్యత్తులో తిరుగులేని సంగీత దర్శకుడిగా మారడానికి బీజం అలా పడింది. ఆ తర్వాత 'జాలీ ఫ్రెండ్స్' ఆర్కెస్ట్రా అనే ట్రూపులో చేరాడు. అక్కడ పాటలు కూడా పాడసాగాడు. సినిమాల్లోకెళ్ళి గొప్ప గాయకుడు కావాలని ఆశపడ్డాడు. ఆ ఆశని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అవసరంగా మార్చాయి.
అట్టడుగుకి వచ్చారు..
శివదత్త సోదరులు.. రాయచూరులో వ్యవసాయ భూములు కొన్నా అందులో ఆశించినంత లాభం రాలేదు. ఉమ్మడి కుటుంబంలో కీరవాణి, రాజమౌళి అందరూ కలిసి పిల్లలే 13 మందిదాకా ఉండేవాళ్ళు. ఇల్లు గడవడం కష్టంగా మారిన ఆ సమయంలోనే పెద్దవాడిగా కీరవాణి అడుగు ముందుకేశాడు. మద్రాసు రైలెక్కాడు. 'అక్కడ పరిచయస్తులుగానీ మిత్రులుగానీ లేరు. సరాసరి స్టూడియోలకే వెళ్ళాను. ఇళయరాజా, కె.వి.మహదేవన్, రాజన్-నాగేంద్ర ఇలా అందరినీ అవకాశాలడిగినా ఫలితం లేకపోయింది. చేసేదేమీ లేక కనీసం వయోలినిస్టుగానైనా వెళదామనుకున్నాను.
అప్పుడే నాకు రాజామణి అనే మలయాళ సంగీత దర్శకుడు పరిచయం అయ్యారు. నా స్వర పరిజ్ఞానం తెలుసుకుని 'బెంగళూరులో ఓ కన్నడ సినిమా రీరికార్డింగ్ ఉంది. మా వయోలినిస్ట్ రాలేదు. అతని రైలు టికెట్ ఉంది.. నువ్వురా' అన్నారు. ఇంటికెళ్లి అన్నీ సర్దుకుని ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూడటం మొదలుపెట్టాను. తెల్లవారుతూనే ఆ టీమ్ నుంచి ఎవరో ఫోన్ చేసి 'టికెట్ క్యాన్సిల్ చేశాం' అన్నారు. దాంతో నేను వాళ్లకి అవసరం లేదేమోనని బాధపడుతుంటే విజయేంద్ర ప్రసాద్ చిన్నాన్నగారు 'నువ్వు వెంటనే బెంగళూరుకి వెళ్లి ఏం జరిగిందో స్వయంగా తెలుసుకో' అన్నారు.
ఆయన మాట ప్రకారం బెంగుళూరు వెళ్లి రికార్డింగ్ స్టూడియోకి చేరుకున్న నన్ను చూసి ఆ సంగీత దర్శకుడు ఎంతో సంతోషించారు. అలా రోజుకు ముఫ్పై రూపాయల జీతం మీద వాళ్ళ ట్రూప్‌లోనే కొన్నాళ్ళపాటు పనిచేశాను. ఆ తర్వాత మా బంధువులు కొందరు సినిమా తీస్తూ సంగీతం బాధ్యతలు నాకు అప్పగించారు. అది తొలిపాట రికార్డింగ్‌తోనే ఆగిపోయింది. రెండో సినిమా అన్ని పాటలూ పూర్తయ్యాక నిలిచిపోయింది. మరో రెండుమూడు అలాగే కావడం వల్ల మా నాన్నగారి సిఫార్సుతో సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్‌గా చేరాను.
ఆయన ఇచ్చినదాంట్లోనే కొంత మా ఉమ్మడి కుటుంబానికి పంపుతుండేవాణ్ణి. కానీ రానురానూ నేను గాయకుణ్ణి కావాలనే కోరిక ఎక్కువైంది. చక్రవర్తిగారి దగ్గర ఉంటే అది సాధ్యంకావడంలేదని బయటకొచ్చాను. కథ మళ్ళీ మొదటికొచ్చింది. పనిలేక నెలల తరబడి పచ్చడి మెతుకులే తిన్నాను. ఓ దశలో అన్నీ మానేసి వ్యవసాయం చేయడానికని రాయచూరు వెళ్ళిపోయాను. కాడిపట్టి దుక్కిదున్నాను! కానీ గాయకుణ్ణి కావాలన్న కలలు నన్ను స్థిమితంగా ఉండనీయలేదు. దాంతో మళ్ళీ మద్రాసు రైలెక్కాను.ఈసారి అక్కడ నాకు వేటూరిగారు పరిచయమయ్యారు.
ఆయనకి సహాయకుడిగా చెప్పిన పనులన్నీ చేసిపెడుతుండేవాణ్ణి. అప్పుడప్పుడూ వందో రెండొందలో ఇస్తుండేవారు. ఓసారి ఆయనే తన 'గీతాంజలి ఆడియో' సంస్థకి కొన్ని పాటలు చేయమన్నారు. మా నాన్న పాటలు రాస్తే... నేను బాణీలు కట్టేవాణ్ణి. నా తొలి పారితోషికంగా వేటూరే ఐదువేల రూపాయలిచ్చారు. దాన్నెంతో అపురూపంగా చూసుకున్నా..' అంటారు కీరవాణి. అప్పుడే అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు నాగార్జున హీరోగా, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 'శివ' సినిమా తీస్తూ కీరవాణిని సంగీతదర్శకుడిగా ఎంచుకున్నారు కానీ.. దానికీ ఓ అవాంతరం వచ్చింది.
తొలిపాట..
'శివ'కి కీరవాణినే అనుకున్నా.. దర్శకుడూ, సంగీత దర్శకుడూ ఇద్దరూ కొత్తవాళ్ళు కావడం సరికాదనుకున్నారు నిర్మాతలు. దాంతో ఇళయరాజాని ఎంచుకున్నారు. ఆ తర్వాత కీరవాణి తనకంటూ ఓ 'విజిటింగ్ కార్డు' తయారుచేసుకున్నారు. తాను చేసిన బాణీలుకొన్ని ఓ క్యాసెట్టులో రికార్డు చేసి దాన్ని కాపీలు తీసి కనిపించిన దర్శక నిర్మాతలకల్లా ఇచ్చారు. ఎవరూ స్పందించలేదు. అప్పుడే వేటూరి సిఫార్సుతో ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నుంచి పిలుపొచ్చింది. 'మనసు-మమత' సినిమాకి సంగీతదర్శకుడిగా తీసుకుంటామన్నారు. అలా 'మధుమాసం కుహూగానం' అన్న ఆయన తొలి పాట రికార్డయింది. 'దాగుడు మూతల దాంపత్యం', 'అమ్మ', 'పీపుల్స్ ఎన్‌కౌంటర్' వంటివి వచ్చినా 'సీతారామయ్యగారి మనవరాలు' మంచి గుర్తింపు సాధించిపెట్టింది. కానీ తొలి అవార్డు మాత్రం తమిళ సీమ నుంచి వచ్చింది.
కె.బాలచందర్‌తో..
ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్‌కి ఇళయరాజాతో పొరపొచ్చాలు రావడం వల్ల కొత్త సంగీత దర్శకుల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. అప్పుడే ఎం.ఎం.కీరవాణి ఆయన కంట పడ్డారు. దేశంలోని హేమాహేమీలతో పనిచేసిన బాలచందర్.. కీరవాణి వినిపించిన ఒకట్రెండు బాణీలతోనే ఆయన లోతేమిటో గ్రహించారు. 'అళగన్' సినిమాకి అవకాశం ఇచ్చారు. కీరవాణి అన్న పేరుకన్నా.. మరకతమణి అన్నది తమిళభాషకి దగ్గరగా ఉంటుందని దాన్ని మాత్రమే వాడుకున్నారు. సంగీతం ప్రధానంగా సాగే ఈ సినిమాకి ఓ కొత్త సంగీతదర్శకుడు ఏం చేస్తాడా అనుకున్నవాళ్ళందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు కీరవాణి.
పాటలన్నీ సూపర్‌హిట్టయ్యాయి! అంతేకాదు, తమిళనాడు ప్రభుత్వం 1991కిగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డుని ఇచ్చింది. కీరవాణి అందుకున్న తొలి పెద్ద అవార్డు అదే. ఈలోపు... తెలుగులో 'క్షణక్షణం' వచ్చి ఆడియో సూపర్‌డూపర్ హిట్టయింది. 'అల్లరిమొగుడు'తో కె.రాఘవేంద్రరావు- ఎం.ఎం.కీరవాణి సూపర్‌హిట్ కాంబినేషన్ మొదలైంది! ఘరానామొగుడు, సుందరకాండ, అల్లరిప్రియుడు, పెళ్ళిసందడి, అన్నమయ్య.. ఇలా వారిద్దరి కలయికలో తెలుగు సినిమా పాటలతోటలో ఎన్నటికీ వన్నెతగ్గని పూలు విరబూశాయి.
కె.విశ్వనాథ్, బాపూ వంటి కళాత్మక దర్శకులతోనూ కీరవాణి అద్భుతమైన సినిమాలు చేశారు. ఎన్నో అవార్డులతో ఐదారేళ్లలోనే 150 పైచిలుకు సినిమాలు పూర్తిచేసుకున్నారు. అప్పట్లో తన జీవితం ఎలా ఉండేదో చెబుతూ.. 'నా రికార్డింగ్ పనులన్నీ ముగించేసరికి ఉదయం నాలుగయ్యేది. అప్పుడు ఇంటికొచ్చి, మంచి నిద్రలో ఉన్న భార్యాపిల్లల్ని లేపడం ఇష్టంలేక వాళ్ళ తలనిమిరి పడుకునేవాణ్ణి. మళ్ళీ తొమ్మిదికాగానే చెంబెడునీళ్ళు ఒంటిమీద గుమ్మరించుకొని స్నానం అయిందనిపించి స్టూడియోలవైపు పరుగులు తీసేవాణ్ణి' అంటారాయన!
వాసి పెరిగింది..
అలాంటి సమయంలోనే- కీరవాణి మనసు ఒకింత విరామం కోరుకుంది. దాంతోపాటూ 'క్షణక్షణం' సినిమా సమయంలో.. 'మంచి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు తప్ప మిగతావి ఒప్పుకోవద్దు' అంటూ రామ్‌గోపాల్ వర్మ ఇచ్చిన సలహా తననెప్పుడూ వెంటాడుతూనే ఉండేది. కానీ 'మా పెద్ద కుటుంబం బాధ్యత నాపైన ఉండేదికాబట్టి.. వచ్చిన ప్రతి సినిమా చేసి ఎంతోకొంత డబ్బు సంపాదించాలని చూసేవాణ్ణి. 1997లో ఇలా కాదు.. కొంత గ్యాప్ తీసుకోవాలి అనిపించింది' అంటాడాయన. అందుకు తగ్గట్టే హిందీ నిర్మాత గుల్షన్ కుమార్ పది సినిమాలకి అవకాశం ఇవ్వడంతో వల్ల కీరవాణి తెలుగు సినిమాలు తగ్గించుకున్నారు.
ఇంతలో గుల్షన్ హత్యకి గురికావడంతో హిందీ సినిమాలన్నీ ఆగిపోయాయి. అలా కొంత గ్యాప్ వచ్చింది. 1999 తర్వాత నుంచి రాశికన్నా వాసికే ప్రాధాన్యం ఇచ్చారు. ఏడాదికి పది సినిమాలదాకా చేసే కీరవాణి.. మూడింటికి పరిమితమయ్యారు. 'సరుకైపోయింది.. అందుకే' అన్నవాళ్ళ నోరుమూయిస్తూ ఎస్‌ఎస్ రాజమౌళి 'స్టూడెంట్ నంబర్ 1'తో తానేమిటో నిరూపించారు. అక్కడి నుంచి 'ఆర్‌ఆర్‌ఆర్' దాకా తన పాటల పదునేమిటో చాటిచెబుతూనే ఉన్నారు కీరవాణి! రాఘవేంద్రరావు- రాజమౌళిల చిత్రాలే కాదు.. మధ్యలో రసూల్ తీసిన 'ఒకరికి ఒకరు', క్రిష్ 'వేదం', చంద్రశేఖర్ యేలేటి 'అనుకోకుండా ఒకరోజు' వంటి ఆణిముత్యాలూ అడుగడుగునా కీరవాణి ముద్రేమిటో చాటుతూనే ఉన్నాయి! అవే కీరవాణిని.. రాశితో సంబంధం లేకుండా ఎవర్‌గ్రీన్‌గా నిలుపుతున్నాయి! కీరవాణి ఇప్పటిదాకా దాదాపు 250 సినిమాలకి పనిచేసుంటారు.
వీటిలో ఎక్కువ భాగం తెలుగే అయినా.. తమిళం, మలయాళం, కన్నడం, హిందీల్లోనూ చేసిన పాటలు ఆయన్ని జాతీయస్థాయి సంగీతదర్శకుడిగా చేశాయి. ఇప్పుడు.. గోల్డెన్‌గ్లోబ్‌తో తెలుగుపాటకి విశ్వవేదిక మీద పట్టంకట్టించారు.అన్నమయ్య పుట్టుకని 'తెలుగు పదానికి జన్మదినం' అన్నారో సినీకవి.ఈ అంతర్జాతీయ గుర్తింపుతో 'తెలుగుపాటకి ధన్యదినం' అనుకునేలా చేశారు కీరవాణి.
పుష్కరాల్లోనే పెళ్లి!
పుష్కరాల సమయంలో పెళ్ళి చేసుకోకూడదంటారు. కానీ, ఆ అపనమ్మకాన్ని పటాపంచలు చేసింది కీరవాణి-శ్రీవల్లిల వివాహం. వల్లివాళ్ళది కాకినాడ. కీరవాణి చిన్నాన్న కూతురు గౌరికి ఆమె స్నేహితురాలు కావడంతో సంబంధం కుదిరింది. మిగతా సమయాల్లో డేట్స్ కుదరక 1991 పుష్కరాలప్పుడే పెళ్ళాడారట. పెళ్ళిలో అంతస్తులకన్నా 'స్పిరిచ్యువల్' పొంతన చక్కగా కుదరాలంటారు కీరవాణి. ముఖ్యంగా- బంధుమిత్రులను ఎలా చూసుకోవాలి అన్నదానిపైన భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయం ఉండాలంటారు. ఆ రకంగా తన విజయంలో సగం అర్ధాంగి శ్రీవల్లికే దక్కుతుందని చెబుతారు. ఇంట 75 శాతం తనని గైడ్ చేసేది ఆమేనంటారు. అందుకే గోల్డెన్ గ్లోబ్ సమయంలోనూ ఆమె పేరునే ఎంతో ఉద్వేగంతో ప్రస్తావించారు!
ఆడంబరాలు నచ్చవు
ఒకప్పుడు చిల్లిగవ్వలేకుండా జీవితాన్ని మొదలుపెట్టినవాడు కాబట్టి కీరవాణి ఆడంబరాలకు వ్యతిరేకి. తనకు పియానో అంటే ఇష్టం కానీ... ఇంట్లో అది పట్టేంత స్థలం లేకపోవడంతో కొనలేదట! స్టూడియో విషయంలోనూ అంతే. తనకంటూ సొంత స్టూడియోలేని సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణియే. తన పిల్లలు కుముద్వతి అపరాజిత, కాలభైరవ, శ్రీసింహలనీ ఆ విలువలతోనే పెంచారు. కష్టం విలువ తెలియాలని- పిల్లల్ని ఓరోజు హైదరాబాద్ శివారులోని ఓ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి పనిచేయించారట!
మర్యాద రామన్న!
తన చుట్టూ ఉన్నవాళ్ళు ఏ పని చేసేవారైనా సరే - చాలా మర్యాదగా మాట్లాడతారు కీరవాణి. ఎంత చిన్నవారయినా 'మీరు' అనే అంటారు. ఓసారి తన డ్రైవర్‌ని ఎవరో పేరుతో కాకుండా 'డ్రైవర్' అని పిలిచారని నొచ్చుకుని.. వాళ్ళతో మాట్లాడటం మానేశారట! అంతేకాదు, తనకిష్టమైన వారికీ తగిన గౌరవం దక్కకపోయినా బాధపడతారు. అప్పట్లో ఓ సంస్థ జాతీయస్థాయి అవార్డు ఒకటి ఇస్తుండేది. ఓసారి దాన్ని కీరవాణికి ఇచ్చారు. దాన్ని అందుకున్నాకే తెలిసిందట- తానెంతో అభిమానించే సంగీత దర్శకుడు ఆర్‌డి బర్మన్‌కి అప్పటిదాకా ఆ అవార్డు ఇవ్వలేదని. అంతే.. ఆ అవార్డు ట్రోఫీని తీసి చెత్తలో పడేశారట.