Siddharth Karnataka Issue : కర్ణాటకలో నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే తనకెదురైన చేదు అనుభవం గురించి హీరో సిద్ధార్థ్ స్పందించారు. తన సినిమా ప్రెసెమీట్‌ను నిరసనకారులు అడ్డుకోవడం వల్ల ఆయన ఎంతో నిరాశపడినట్లు తెలిపారు. తన సినిమాకు అక్కడ జరుగుతున్న జల వివాదానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన అన్నారు. దీని వల్ల తన చిత్రానికి భారీ నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
" 'చిన్నా' సినిమా నిర్మాతగా విడుదలకు ముందే నేను ఈ సినిమాను చాలా మందికి చూపించాలని అనుకున్నాను. అందులో భాగంగానే చెన్నైలో కొంతమందికి చూపించాను. అలాగే బెంగుళూరులోని మీడియాకు ఈ చిత్రాన్ని చూపించాలని ప్లాన్ చేశాను. రిలీజ్‌కు ముందే 2000 మంది విద్యార్థులకు ఈ సినిమాను చూపించాలనుకున్నాను. ఇలా ఇప్పటి వరకు ఏ సినిమా దర్శక నిర్మాతలు ఇలా చేయలేదు. కానీ, బంద్ కారణంగా మేం అన్నింటినీ రద్దు చేశాం. దీని వల్ల మాకు భారీ నష్టం వాటిల్లింది. దానికి మించిన బాధకరమైన విషయం ఏంటంటే మంచి సినిమాను అక్కడి ప్రజలతో పంచుకోలేకపోయాం. ఇది నాకెంతో నిరాశ కలిగించింది. ప్రెస్‌మీట్ తర్వాత అందరికీ సినిమా చూపించాల్సి ఉంది. కానీ, అక్కడ ఏం జరిగిందో మీరంతా ఇప్పటికే చూసుంటారు. కెమెరాల ముందు జరిగిన దాని గురించి నేను మాట్లాడదలచుకోవడం లేదు. సినిమాకు మంచి ప్రేక్షకాదరణ వస్తోంది. నా సినిమాకు ఈ వివాదానికి ఎలాంటి సంబంధం లేదు. నేను తీసే సినిమాల్లో సామాజిక బాధ్యత కనిపిస్తుందని నేను నమ్ముతున్నాను" అని సిద్ధార్థ్ అన్నారు.
మరోవైపు ఈ ఘటనపై స్పందింటిన పలువురు సినీ సెలబ్రిటీలు కర్ణాటక ప్రజల తరపున సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెబుతున్నారు. ఇప్పటికే సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శివరాజ్ కుమార్‌లు ట్విట్టర్ వేదికగా.. ఈ విషయంపై వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. సిద్ధార్థ్‌కు సారీ చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
అసలేం జరిగింది :
హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'చిన్నా'. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎమోషనల్‌గా డ్రామాగా రూపొందిన ఈ చిత్రం గురువారం(సెప్టెంబర్ 28) రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్.. తాజాగా కర్ణాటకలో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. అయితే కార్యక్రమం ప్రారంభం అయిన కాసేపటికే.. కొందరు ఆందోళనకారులు అక్కడికి చేరుకుని ప్రెస్‌మీట్ ఆపేయాలని గొడవ చేశారు. ఆ రాష్ట్రంలో నదీ జలాల విషయంలో వివాదం నెలకొన్న తరుణంలో... తమ ప్రాంతంలో ప్రెస్‌మీట్ నిర్వహించడంపై ఆందోళకారులు అసహనం వ్యక్తం చేశారు. సమావేశాన్ని వెంటనే నిలిపివేసి.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.