దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు వల్లే తమ ప్రేమ బంధానికి ముగింపు పలకాల్సి వచ్చిందని టీవీ నటుడు షీజన్ ఖాన్ పోలీసులకు చెప్పారు. టీవీ నటి తునిశా శర్మతో షీజన్ ఖాన్ 15 రోజుల క్రితమే విడిపోయినట్లు సమాచారం. దాంతో కలత చెందిన నటి ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టయిన షీజన్.. పోలీసు కస్టడీలో ఉన్నారు.
'శ్రద్ధా వాకర్ హత్య ఘటన తర్వాత..'
శ్రద్ధా దారుణ హత్య తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులతో తీవ్ర కలవరానికి గురైనట్లు విచారణలో భాగంగా షీజన్ పోలీసులకు వెల్లడించారు. ఆ తర్వాతే తునిశాతో సంబంధాన్ని తెంచుకున్నట్లు చెప్పారు. తమ మతాలు, వయసు తేడా భవిష్యత్తులో అడ్డుగా మారొచ్చని ఆమెకు చెప్పినట్లు తెలిపారు. 'తునిశా కొద్దిరోజుల క్రితం కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్పుడు నేనే కాపాడాను. తునిశాను జాగ్రత్తగా చూసుకోమని ఆమె తల్లికి చెప్పాను' అని షీజన్ చెప్పినట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి.
'షీజన్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే'
తన కుమార్తెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన షీజన్.. తర్వాత ఆమెకు బ్రేకప్ చెప్పాడని తునిశా తల్లి వనిత ఆరోపించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. వేరొక మహిళతో సంబంధం పెట్టుకొని, తన కుమార్తెతోనూ బంధాన్ని కొనసాగించాడని ఆవేదన వ్యక్తం చేశారు. షీజన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తునిశా మరణంతో తమ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని.. కచ్చితంగా షీజన్‌ను శిక్షించాలని ఆమె మేనమామ పవన్ కూడా డిమాండ్ చేశారు.
![Shraddha murder case led to our break up: Sheezan to police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17315647_eeee.jpg)
'రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలి'
తునిషా సూసైడ్ కేసును విచారించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) ఆదివారం డిమాండ్ చేసింది. తాను తునిషా సూసైడ్ చేసుకున్న సెట్‌కు వెళ్లానని, ఏదో తప్పు జరిగిందన్న అనుమానం కలుగుతోందని ఏఐసీడబ్ల్యూఏ అధ్యక్షుడు సురేశ్ శ్యామ్‌లాల్ గుప్తా తెలిపారు.
'ఇద్దరి ఫోన్లు ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపాం'
తునిషా శర్మ, షీజన్ ఖాన్ మధ్య సరిగ్గా ఏమి జరిగిందో క్లుప్తంగా తెలుసుకోవడానికి వారిద్దరి ఫోన్లలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం సీరియల్ సెట్‌కు తునిషా సంతోషంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిందని పోలీసులు చెప్పారు.
![Shraddha murder case led to our break up: Sheezan to police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17315647_moee.jpg)
షూటింగ్ సెట్లో ఆత్మహత్య..
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాసాయిలో తాను నటిస్తున్న టీవీ సీరియల్ సెట్‌లోనే తునిశా శర్మ శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. టీ విరామ సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లిన తునిషా ఎంతకు తిరిగిరాలేదు. చాలాసేపు వేచి చూసిన సిబ్బంది అనుమానంతో పోలీసులకు.. సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బాత్‌రూమ్ తలుపులు బద్దలు కొట్టి చూడగా తునిష ఉరివేసుకుని కనిపించారు.
బాలనటిగా కెరీర్ మొదలు..
బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన తునిశా పలు చిత్రాల్లో కూడా నటించారు. కత్రినా కైఫ్, విద్యాబాలన్ వంటి స్టార్లతో కలిసి పనిచేశారు. 'భారత్ కా వీర్ పుత్ర' అనే సీరియల్‌తో 13 ఏళ్లకే నటిగా మారిన తునిశా.. 'చక్రవర్తి అశోక సామ్రాట్', 'గబ్బర్ పూన్చావాలా', 'ఇంటర్నెట్ వాలాలవ్', 'హీరో: గాయబ్ మోడ్ ఆన్' తదితర ధారావాహికల్లో నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. 'ఫితూర్' సినిమాలో కథానాయిక కత్రినా కైఫ్ చిన్నప్పటి పాత్ర పోషించారు.
ఇదీ చదవండి: బుల్లితెర నటి సూసైడ్ కేసు.. మాజీ లవర్ అరెస్ట్.. అతడితో బ్రేకప్ వల్లే..!