గత కొంతకాలంగా బాలీవుడ్ పరిస్థితి బాగోలేదన్న సంగతి తెలిసింది. అక్కడి చిత్రాలు దాదాపుగా అన్నీ పరాజయం చెందుతున్నాయి. అయితే అందుకు ఓ కారణం.. ఓటీటీలని ఈ మధ్య కాలంలో ఓ చర్చ కూడా జరిగింది. అయితే ఇప్పుడు దీనిపై బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ స్పందించారు. కొవిడ్ కారణంగా ప్రేక్షకులు కంటెంట్ చూసే విధానంలో మార్పు వచ్చిందన్నారు. మొబైల్ స్క్రీన్ చాలా చిన్నగా ఉంటుందని అందులో సినిమా చూస్తే థియేటర్లో చూసిన అనుభూతి రాదన్నారు. సినిమా స్థాయిని ఏదీ తగ్గించలేదని షారుక్ అన్నారు.
ఇటీవల జరిగిన రెడ్ సీ ఫెస్టివల్‌లో షారుక్ మాట్లాడుతూ.. "నేను మూడు దశాబ్దాలుగా సినిమా రంగంలో కొనసాగుతున్నాను. ఇలాంటివి ఎన్నో చూశాను. టీవీలు వచ్చిన సమయంలో 'టీవీ వచ్చింది ఇక థియేటర్లో సినిమాలు ఎవరు చూస్తారు' అన్నారు. ఆ తర్వాత వీసీఆర్‌లు వచ్చాయి. 'ఇక సినిమాలన్నీ వీసీఆర్‌లోనే చూస్తారని' అన్నారు. కానీ ఏదీ మారలేదు. సినిమాను ఆదరించేవారు ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారు. చలనచిత్ర రంగం కొత్తపుంతలు తొక్కుతూ నూతనోత్సాహంతో ముందుకు వస్తుంది"అని ధీమా వ్యక్తం చేశారు. అలాగే థియేటర్లో సినిమా చూస్తే ఔటింగ్‌కు వెళ్లినట్లు ఉంటుందని మొబైల్‌లో చూస్తే అలా ఉండదన్నారు.
కాగా, దాదాపు 5 సంవత్సరాల తర్వాత తన కొత్త సినిమా పఠాన్‌ను థియేటర్లో విడుదల చేయనున్నారు షారుక్. జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. జాన్ అబ్రహం, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: దిల్‌రాజు అలా చేస్తే చిరు, బాలయ్యను అవమానించినట్టే: సి.కల్యాణ్