'గోల్కొండ హైస్కూల్'తో తెరపైకి వచ్చి, 'తను నేను'తో హీరోగా మారి, 'పేపర్ బాయ్', 'ఏక్ మినీ కథ', 'మంచి రోజులొచ్చాయి'లతో యువతను ఆకర్షించిన నటుడు సంతోష్ శోభన్. ఆయన నటించిన తాజా చిత్రం 'లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్'. ఫరియా అబ్దుల్లా కథానాయిక. మేర్లపాక గాంధీ దర్శకుడు. నవంబరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా సంతోష్ మీడియాతో మాట్లాడారు.
ఈ సినిమా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే తీశారా?
సంతోష్: 'లైక్, షేర్ అండ్ సబ్‌స్రైబ్' కథకు ఫస్ట్ ఛాయిస్ నేనేనని మేర్లపాక గాంధీ చెప్పారు. ఆయన మాటని నమ్ముతున్నా (నవ్వుతూ). ఇందులో నేను యూట్యూబర్ విప్లవ్‌గా నటించా. నా మనసుకు బాగా దగ్గరైన క్యారెక్టర్ అది. దర్శకుడు గాంధీ.. నటులకు పెద్దగా పని చెప్పరు. ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరించి, తేలిగ్గా అవుట్‌పుట్ రాబట్టుకుంటారు. ఆయన దర్శకత్వంలో ఇంతకుముందు 'ఏక్ మినీ కథ' అనే చిత్రంలో నటించా. అప్పటి నుంచే ఆయనతో మంచి అనుబంధం ఉంది. మళ్లీ ఇద్దరం కలిసి పనిచేయానుకున్నాం.. ఆ అవకాశం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు.
యూట్యూబర్ కథ అంటున్నారు.. అన్ని వర్గాల వారికి చేరుతుందా?
సంతోష్: ఈరోజుల్లో యూట్యూబ్ గురించి తెలియనివారు లేరు. చాలామంది యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. వారంతా 'లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' అని ఎంత బాగా చెబుతారో.. మారేడుమిల్లి అడవిలో ఈ సినిమాని చిత్రీకరిస్తున్నప్పుడు మాకు అర్థమైంది. ఈ చిత్రం వారూ వీరూ అని కాదు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో యాక్షన్, కామెడీ అంశాలున్నాయి.
ట్రైలర్‌లో 'ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం' అనే డైలాగ్ ఉంది కదా? ఏం చెప్పబోతున్నారు?
సంతోష్: ఈ చిత్రంలో ఓ సీరియస్ అంశాన్నీ ఎంతో సరదాగా చెప్పబోతున్నాం. ఆ డైలాగ్ ఎందుకు చెప్పానో సినిమా చూస్తే అర్థమవుతుంది. 'పీపుల్ ప్రొడక్షన్ ఫోర్స్' అనే గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి.
మీతో కలిసి నటించిన వారి గురించి ఏం చెబుతారు?
సంతోష్: ఫరియా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. హిట్ చిత్రం 'జాతిరత్నాలు' తర్వాత ఆమె నటించిన సినిమా ఇది. ఎలాంటి లెక్కలేసుకోకుండా కథపై నమ్మకంతో ఈ సినిమాలో నటించింది. ఆమె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నటుడిగా సుదీర్ఘ అనుభవమున్న బ్రహ్మాజీగారు ప్రతి సన్నివేశం గురించీ చర్చిస్తుంటారు. అలాంటి నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. సుదర్శన్ విషయానికొస్తే.. మేం ఇంతకు ముందు 'ఏక్ మినీ కథ'లో కలిసి నటించాం. మా కాంబో ఈ సినిమాలో మరింత ఫన్ పంచుతుంది. వీరే కాదు ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చారు.
తదుపరి ప్రాజెక్టుల వివరాలు?
సంతోష్: నందిని రెడ్డి దర్శకత్వంలో నటించిన 'అన్నీ మంచి శకునములే' డిసెంబరు 21న విడుదలవుతుంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో 'కల్యాణం కమనీయం' అనే సినిమా చేస్తున్నా.
''ఓ అభిమానిగానే ప్రభాస్‌ను కలుస్తుంటా. ఆయనెంతో బిజీగా ఉంటారు. అయినా నా కోసం తీరిక చేసుకుని నా సినిమాల టీజర్, ట్రైలర్, సాంగ్స్‌ను విడుదల చేస్తుంటారు. అది ఆయన మంచితనం. నేను ఎంతో నమ్మకంతో నటించిన 'లైక్, షేర్ అండ్ సబ్‌స్రైబ్'ను ఆయనకు చూపించాలనేదే నా డ్రీమ్. నాన్న (దర్శకుడు, దివంగత శోభన్) దూరమై 14 ఏళ్లవుతోంది. ఆయన నాతోనే ఉన్నట్టు ఉంటుంది'' అని సంతోష్ అన్నారు. ప్రభాస్ హీరోగా గతంలో వచ్చిన 'వర్షం' సినిమాను శోభన్ తెరకెక్కించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">