RRR: పాన్ ఇండియా కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వారిలో రచయిత విజయేంద్ర ప్రసాద్ (దర్శకుడు రాజమౌళి తండ్రి) ఒకరు. 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' తదితర వైవిధ్యభరిత కథలు ఆయన కలం నుంచి వచ్చినవే. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్' సీక్వెల్‌పై విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో తనకెదురైన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు. ''ఓ రోజు ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చాడు. 'ఆర్‌ఆర్‌ఆర్' కొనసాగింపు చిత్రం గురించి అడిగాడు. నేను కొన్ని ఐడియాలు చెప్పా. తనకు, రాజమౌళికి బాగా నచ్చాయి. దైవానుగ్రహం ఉంటే సీక్వెల్ వస్తుంది" అని తెలిపారు.
డీవీవీ దానయ్య నిర్మించిన ఈ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా ఆకట్టుకున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.710 కోట్లు (గ్రాస్) వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.
హిందీ మార్కెట్లో కూడా: మార్చి 25న విడుదలైన ఈ సినిమా మొదటి వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా ఎంతో కీలకమైన హిందీ మార్కెట్లో కూడా సాలిడ్ వసూళ్లును అందుకుంది. ఇక, వీక్ డేస్‌లోనూ స్ట్రాంగ్ హోల్డ్ని కనబరిచింది. ఇప్పుడు మళ్లీ వారాంతానికి రాగా ఈ భారీ సినిమా మళ్లీ పుంజుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో శుక్రవారం(8వ రోజు) హిందీలోనే రూ. 13 కోట్ల నెట్ వసూలు చేసిందట. ఈ శని, ఆదివారాల్లో మరింత కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి మళ్లీ హిందీ బెల్ట్‌లో 'ఆర్ఆర్ఆర్' రోరింగ్ బ్లాస్ట్ ఓ రేంజ్లో వినిపిస్తోందని చెప్పొచ్చు.
ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' జోష్‌తో.. 'శుభకృత్'లోకి తెలుగు చిత్రసీమ..