'ఆర్ఆర్ఆర్'తో భారతీయ చిత్ర పరిశ్రమ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల్లో నామినేట్ అయింది. తెలుగు దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన అద్భత దృశ్య కళాఖండం 'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటు నాటు' పాట ఆస్కార్ నామినేషన్లలో నిలిచింది. మ్యూజిక్ మాంత్రికుడు ఎమ్ఎమ్ కీరవాణి అందించిన స్వరాలకు.. సినీ కవి చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ఈ పాటతో పాటు అప్లాజ్, హోల్డ్ మై హ్యాండ్, లిఫ్ట్ మీ అప్, దిస్ ఈజ్ ఏ లైఫ్ అనే పాటలు నామినేషన్లో నిలిచాయి.
అప్రతిహతంగా అవార్డుల పరంపర..
ఆర్ఆర్ఆర్ సినిమా అంచనాలకు మించి అప్రతిహతంగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు పలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఆస్కార్ రేసులో నిలిచింది. ప్రపంచంలోని దగ్గజ సినీ దర్శకులు, టెక్నీషియన్లు, నటీనటుల నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ లాంటి వారు విశ్లేషించే స్థాయికి భారత సినిమా చేరుకుందంటే.. అది ఆర్ఆర్ఆర్ వళ్లనే.