నాలుగు సంవత్సరాల విరామం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఈ ఏడాది.. షంషేరా, బ్రహ్మస్త్ర సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు. అయితే అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన బ్రహ్మస్త్ర సూపర్ హిట్‌గా నిలవగా.. కరణ్ మల్హోత్రా తెరకెక్కించిన షంషేరా చిత్రం బాక్సాఫీఫ్ వద్ద నిరాశపరిచింది. తాజాగా రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో షెంషేరా ఎందుకు అలరించలేకపోయిందో రణబీర్ చెప్పారు.
తాను చేసిన అతి కష్టమైన సినిమాల్లో షంషేరా ఒకటని రణ్‌బీర్ చెప్పారు. "ఈ సినిమా పరాజయం పొందడం వెనక మేము చేసిన పొరపాట్లు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి నా గడ్డం. నేను ఈ సినిమా కోసం కృత్రిమ గడ్డాన్ని పెట్టుకున్నాను. ఎండలో షూటింగ్ చేసేటప్పుడు అది సహజంగా కనిపించలేదు. ముఖానికి అతుక్కున్నట్లు కనిపించేది. అందుకే ఈ సినిమా హిట్ అవ్వలేదని అనుకుంటా" అన్నారు.
రణబీర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో సంజయ్ దత్, వాణి కపూర్, రోనిత్ రాయ్, సౌరభ్ శుక్లా నటించారు. కాగా, ఈ చిత్రం దాదాపు రూ.150కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. అలాగే తన కెరీర్‌లో 2017లో విడుదలైన జగ్గా జూసూస్ సినిమా హిట్ అవ్వకపోవడం తననెంతో బాధించిందని రణబీర్ తెలిపాడు. కొవిడ్ కారణంగా చిత్రపరిశ్రమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని, బలమైన కథనాలతో నూతనోత్తేజంతో భారతీయ సినిమా తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: అలా చేసేందుకు తమన్నా గ్రీన్‌సిగ్నల్.. షాకైన స్టార్ యాక్టర్!