'యశోద' సినిమా సక్సెస్ తర్వాత స్టార్ హీరోయిన్ సమంత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నమైపోయారు. ఓ వైపు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పాటు 'ఖుషి' సినిమా చేస్తూనే మరోవైపు 'సిటాడెల్' సిరీస్ ఇండియన్ వెర్షన్ షూట్లో బిజీగా ఉన్నారు. గత కొంత కాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత.. చికిత్స తీసుకుంటూనే సినిమాల్లో నటిస్తున్నారు.
అయితే తన అభిమానులతో టచ్‌లో ఉండటం కోసం సమంత సామాజిక మాధ్యమాల్లో తన ఫోటోలతో పాటు సినీ, హెల్త్ అప్డేట్స్ను అందిస్తుంటారు. అయితే ఇటీవలే 'సిటాడెల్' సిరీస్ షూట్లో భాగంగా గాయపడిన తన చేతుల ఫొటోను షేర్ చేశారు ఈ 'యశోద' స్టార్. దీంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఈ సిరీస్‌లో స్పై పాత్రలో నటిస్తున్న సామ్ ఇలాంటి యాక్షన్ సీన్లు చేయడం సహజం అని అంటున్నారు నెటిజన్లు. తన చేతి గాయాలు త్వరగా మానిపోవాలంటూ మరి కొంత మంది అభిమానులు ప్రార్థిస్తున్నారు.
అయితే తాజాగా 'సిటాడెల్'లో సమంత పాత్ర గురించి దర్శకులు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ ఇండియన్ వెర్షన్ కోసం సమంతలోని పూర్తి టాలెంట్‌ను మొత్తాన్ని బయటకు తీస్తామని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇందులో ఆమె హై-ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలలో నటిస్తుందని అన్నారు. ఆమె పాత్ర చాలా కఠినంగా ఉండబోతుందని తెలిపారు. ఇక ఇది విన్న ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్తూనే జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఇప్పటికే 'యశోద' సినిమాలో సామ్ యాక్షన్ సీన్స్ చూసిన అభిమానులు.. ఈ స్పై పాత్రకు సామ్ కరెక్ట్ ఛాయిస్ అంటూ కొనియాడుతున్నారు.
ఇక సిరీస్ విషయానికి వస్తే.. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డికే.. ఈ 'సిటాడెల్' ఇండియన్ వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సామ్‌తో పాటు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ఈ సిరీస్‌లోని యాక్షన్ సీన్స్ కోసం వీరిద్దరూ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారు. అయితే ఇండియన్ వెర్షన్లో సామ్ నటిస్తుండగా.. ఈ సిరీస్ హాలీవుడ్ వెర్షన్ కోసం గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. రీసెంట్గా ఈ ఇంగ్లీష్ వెర్షన్‌కు సంబంధించిన ప్రియాంక చోప్రా నటించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది అమెజాన్. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ వైరలవుతోంది.