Prabhas Adipurush: ప్రభాస్ 'ఆదిపురుష్' శరవేగంగా ముస్తాబవుతోంది. అనుకున్న సమయానికే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న చిత్రం విడుదల కానుంది. ఆ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ మరోమారు ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పనులు లాస్ ఏంజెలిస్‌లో జరుగుతున్నాయి. త్రీడీ, ఐమాక్స్ హంగులతో సినిమా ముస్తాబవుతోందని ఓం రౌత్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. రామాయణం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ప్రభాస్ రాఘవ్‌గా, సైఫ్ అలీఖాన్ లంకేశ్‌గా, కృతిసనన్ జానకిగా సందడి చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Ranbir kapoor Animal movie: రణ్‌బీర్ కపూర్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'యానిమల్'. రష్మిక కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఓ కీలక భాగాన్ని పూర్తి చేసినట్లు రణ్‌బీర్ తెలిపారు. "నా కంఫర్ట్ జోన్‌కు పూర్తి దూరంగా ఉండే పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నా. చాలా షాకింగ్ క్యారెక్టర్ ఇది. గ్రే షేడ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అదే సమయంలో లోపల కాస్త భయంగానూ ఉంది" అని రణ్‌బీర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన నటించిన 'షంషేరా', 'బ్రహ్మాస్త్ర' విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Venkatesh new movie: 'ఎఫ్3'తో నవ్వించిన వెంకటేష్... తన కొత్త సినిమాని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. కొంతకాలంగా కథల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన, ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌తో కలిసి హిందీ చిత్రం 'కభీ ఈద్ కభీ దివాలి' చేస్తున్నారు. మరి సోలోగా వెంకీ చేయనున్న కొత్త చిత్రం ఏమిటనేది మాత్రం ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. కొంతకాలం కిందట 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్‌కీ, వెంకటేష్‌కీ మధ్య కథా చర్చలు నడిచాయి. ఈ కలయికలోనే సినిమా పట్టాలెక్కుతుందనే ప్రచారం సాగినా... అనుదీప్ మరో చిత్రం 'ప్రిన్స్' కోసం రంగంలోకి దిగారు. అయితే వెంకీ - అనుదీప్ కలయికలో సినిమా మాత్రం దాదాపు ఖరారైనట్టు తెలిసింది. దసరాకి ఆ చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయనేది పరిశ్రమ వర్గాల మాట.
ఇదీ చూడండి: Ponniyan Selvan: సింగిల్ సాంగ్.. 300మంది డ్యాన్సర్స్, 25 రోజుల షూటింగ్