NTR Chandrababu : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌పై.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం వల్ల తీవ్ర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ ఇదే వాడీవేడీ చర్చ కొనసాగుతోంది. అయితే ఇదే విషయమై నందమూరి బాలకృష్ణను అడగగా.. 'ఐ డోంట్ కేర్ బ్రదర్' అనే బదులిచ్చి షాక్ ఇచ్చారు.
అయితే ఈ క్రమంలో తాజాగా సినీ నటుడు, ఎన్టీఆర్ స్నేహితుడైన రాజీవ్ కనకాల ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. వరుస చిత్రాలతో గ్యాప్ లేకుండా ఉండటం వల్ల ఎన్టీఆర్ రియాక్ట్ అయి ఉండకపోవచ్చని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. "ఆర్‌ఆర్‌ఆర్ సినిమా, కరోనా గ్యాప్‌లో ఎన్టీఆర్ కనీసం నాలుగు సినిమాలు చేసేవాడు. ప్రస్తుతం ఆయన 'దేవర'లో నటిస్తున్నారు. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. పైగా రెండు భాగాలుగా రాబోతుంది. యాక్టింగ్ అంటే అతనికి చాలా ఇష్టం. దీంతో పూర్తి సమయాన్ని సినిమాకే కేటాయిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రంపైనే ఫోకస్ పెట్టాలని భావించి ఉంటారని నేను అనుకుంటున్నాను" అని రాజీవ్ కనకాల అన్నారు.
రెండేళ్లు పట్టొచ్చు.. అలానే తాను పాలిటిక్స్‌లోకి వచ్చే విషయమై కూడా మాట్లాడారు రాజీవ్ కనకాల. "నేను పాలిటిక్స్ కోసం సమయం కేటాయించగలనని అనుకున్నప్పుడు కచ్చితంగా వస్తాను. పాలిటిక్స్‌లోకి రావాలంటే ముందు వాటిని అధ్యయనం చేయాలి. చాలా తెలుసుకోవాల్సి వస్తుంది. రెండేళ్ల సమయం పట్టొచ్చు. అవేవీ చేయకుండా రేపు ఉదయాన్నే రాజకీయాల్లోకి వస్తానంటే కుదరదు. ఒకప్పటితో పోలిస్తే, ప్రస్తుతం పాలిటిక్స్ చాలా మారిపోయాయి. వ్యక్తిగత విమర్శలు కూడా ఎక్కువైపోయాయి. సినిమావాళ్లు ఎంతో కష్టపడి ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా ప్రజల కోసం ఎంతో కష్టపడతారు. అయితే, దయచేసి ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. అది చేయడం చాలా తప్పు" అని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం దేవరతో బిజీగా ఉన్న ఆయన ఆ తర్వాత హిందీలో వార్ 2, అనంతరం ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నారు. వీటి తర్వాత త్రివిక్రమ్‌తోనూ ఓ సినిమా ఉంటుందట.