NTR 30 First Look : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న సినిమాకు సంబంధించిన హీరో ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. కత్తి చేతిలో పట్టుకుని సముద్రం పక్కన నిలబడి ఉన్న ఎన్టీఆర్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అందరూ ఊహించినట్లుగానే దేవర అనే టైటిల్ ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. వచ్చే ఏడాది ఏప్రిల్5న సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ, దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా. ఇక మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్‌కు కూడా ఇదే మొదటి స్ట్రయిట్ తెలుగు సినిమా. సైఫ్ అలీ ఖాన్‌కు జోడిగా ప్రముఖ టీవీ నటి చైత్ర రాయ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ప్రకాశ్ రాజ్ కూడా మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా టెక్నీషియన్ల విషయంలో కూడా నిర్మాతలు ఎక్కడా రాజీ పడటం లేదు. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ 'దేవర'కు సంగీతం అందిస్తున్నారు. గత సంవత్సరం విడుదలైన మోషన్ పోస్టర్‌కు అనిరుథ్ అందించిన 'వస్తున్నా' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జాతీయ అవార్డు అందుకున్న ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లకు పని చేసిన సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉన్నారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్, ఆక్వామ్యాన్ వంటి సినిమాలకు పని చేసిన బ్రాడ్ మినిచ్ వీఎఫ్ఎక్స్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
అయితే ఈ సినిమాకు దేవర అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారనే టాక్ శుక్రవారం ఉదయం నుంచి జోరుగా సాగింది. దీనిపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. "దేవర.. నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్. నేను మర్చిపోవడం వల్ల.. నా టైటిల్‌ను కొట్టేశారు" అని పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి "నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్. ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా. ఆయన కూడా నాకు దేవరే" అని మరో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు పంచ్ డైలాగులతో స్పందిస్తున్నారు.
కథ చెప్పేసిన కొరటాల
ఎన్టీఆర్ 30 సినిమా లాంఛింగ్ ఈవెంట్లో కథ, హీరో క్యారెక్టర్ గురించి కొరటాల శివ చెప్పేశారు. ''అనగనగా సముద్ర తీర ప్రాంతం! మనం మర్చిపోయిన భూభాగం! ఆ ప్రాంతంలో మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటాయి. భయం అంటే ఏమిటో తెలియని మృగాలు అవి. దేవుడు అంటే భయం లేదు. చావు అన్నా భయం లేదు. కానీ, ఒక్కటి అంటే భయం. ఆ భయం ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. ఇదీ కథా నేపథ్యం'' అని కొరటాల చెప్పారు. ''భయం ఉండాలి, భయం అవసరం కూడా! భయపెట్టడానికి సినిమాలో ప్రధాన పాత్ర (హీరో) ఏ స్థాయికి వెళతాడనేది ఎమోషనల్ రైడ్. ఇది నా బెస్ట్ సినిమా అని ప్రామిస్ చేస్తున్నాను'' అని కొరటాల శివ వివరించారు.