Naga Chaitanya Comments On Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి తన మాజీ భర్త, టాలీవుడ్ కథనాయకుడు నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంత మంచి మనసున్న వ్యక్తి అని.. ఆమె జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. తన తదుపరి చిత్రం 'కస్టడీ' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంతతో విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము లీగల్‌గా విడాకులు తీసుకున్నామని తొలిసారిగా తెలిపారు.
"మేము విడిపోయి రెండేళ్లు. చట్టబద్ధంగా విడాకులు తీసుకుని ఏడాది అయింది. కోర్టు కూడా మాకు విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం మేము మా జీవితంలో ముందుకు సాగుతున్నాము. జీవితంలోని ప్రతి దశను నేను గౌరవిస్తాను. సమంత మంచి వ్యక్తి. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. సోషల్ మీడియాలో పుకార్ల కారణంగా మా మధ్య విషయాలు ఇబ్బందికరంగా మారాయి. ఒకరిపై ఒకరికి గౌరవం లేదనే విషయం ప్రజల్లోకి వెళ్లింది. అది నాకు చాలా బాధ కలిగించింది"
"అలాగే ఈ మొత్తం వ్యవహారంలో నీచమైన విషయం ఏమిటంటే.. నా గతంతో సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగి వార్తలు రాయడం. దీని వల్ల మూడో వ్యక్తికి అగౌరవం కలిగింది. మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నప్పుడు చాలా మంది నన్ను వ్యక్తిగత జీవితం గురించి అడుగుతారు. మొదట్లో నేను పట్టించుకోలేదు.. ఇలాంటి ప్రశ్నలకు మౌనంగా ఉండేవాడిని.. కాకపోతే నా పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. పుకార్లు ఎందుకు సృష్టిస్తున్నారు? ఇది అర్థం కావడం లేదు" అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు.
అనంతరం అక్కినేని హీరోలకు వస్తున్న వరుస పరాజయాలపై స్పందించాడు చైతూ స్పందించారు. "ఎప్పడైనా విజయవంతమయ్యే సినిమాలు తీయాలనుకుంటాం. కానీ, ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు విజయం సాధించలేదు. మనిషి కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం. వాటన్నింటిని దాటుకుంటూ ముందుకు సాగుతున్నాం. త్వరలోనే విజయాలతో ప్రేక్షకులను అలరిస్తాం. 'కస్టడీ' సినిమాపై నమ్మకంతో ఉన్నాను. ఎప్పుడైనా అభిమానుల ప్రేమను అందుకోవడం ఆనందంగా ఉంటుందని" నాగ చైతన్య వివరించాడు.
నాగ చైతన్య నటించిన కస్టడీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. చైతూ ఇంటెన్స్ సీన్లలో అదరగొట్టాడు. ఈ పవర్ఫుల్ సినిమాలో చైతన్య సరసన కృతి శెట్టి ఆడిపాడనుంది. నటి ప్రియమణి మరో ప్రధాన పాత్రలో నటించింది. ఇక, ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజ, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.