Mohanlal free education: తన విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్. అయితే ఈయనలో నటన ప్రతిభతో పాటు మంచి మనసు కూడా ఉంది. పలు సందర్భాల్లో ఎంతో మందికి అండగా నిలిచి తన మంచి మనసును చాటుకున్నారు. అయితే తాజాగా మరోసారి తన ఉదారతను చూపించారు. గిరిజన తెగకు చెందిన 20మంది విద్యార్థులకు 15ఏళ్ల పాటు ఉచిత విద్యను అందించడానికి ముందుకు వచ్చారు. ఈ విద్యకు అయ్యే ఖర్చును విశ్వశాంతి ఫౌండేషన్‌కు చెందిన వింటేజ్ పథకం ద్వారా చెల్లించనున్నారు.
"మొదటి దశగా ఈ ఏడాది 20 మందిని ఎంపిక చేశాం. విశ్వశాంతి ఫౌండేషన్ చొరవతో వింటేజ్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ప్రయత్నంలో మేం అట్టప్పాడికి చెందిన గిరిజన గ్రామాల్లో ఆరో తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులను స్పెషల్ క్యాంప్స్ ద్వారా ఎంపిక చేశాం. వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచేందుకు వచ్చే 15ఏళ్ల పాటు ఉత్తమ విద్య, వనరులను అందిస్తాం" అని మోహన్‌లాల్ తెలిపారు. ప్రస్తుతం మోహన్‌లాల్ '12th మ్యాన్', 'అలోన్', 'మాన్స్టర్', 'రామ్' సహా పలు చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: 'శ్రీదేవి శోభన్‌బాబు' గీతం విన్నారా!.. ఓటీటీలోకి 'ఆర్ఆర్ఆర్'?