టాలీవుడ్ వెండితెరపై విలక్షణ నటుడు అనగానే టక్కున గుర్తొచ్చే పేరు మోహన్ బాబు. తనదైన విలనిజం, హీరోయిజంతో.. చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కెరీర్లో ఎన్నో చిత్రాల్లో నటించి 'డైలాగ్ కింగ్'గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేశారు. అయితే ఆయన ఆదివారం(మార్చి 19) తన 71వ పుట్టినరోజు జరుపుకోనున్న సందర్భంగా.. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన సినీ కెరీర్లో ఎదుర్కొన్న కష్టాలను, అనుభవాలను తెలిపారు. తాను ఎదుర్కొన్న కష్టాలు పగవాడికి కూడా రాకూడదని అన్నారు.
"మీకు నేను పైకి బాగానే కనిపించొచ్చు. కానీ నా సినీ కెరీర్లో ఎదురైన ఇబ్బందుల వల్ల ఓ దశలో నా ఇల్లు కూడా అమ్ముకున్నాను. అయితే అప్పుడు ఏ ఒక్కరు కూడా నాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇంకా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాను. నా కష్టాలు పగవాడికి కూడా రాకూడదని అని అనుకుంటుంటాను. రీసెంట్గా నేను తీసిన సన్ ఆఫ్ ఇండియా, జిన్నా సినిమాలు ఫెయిల్యూర్ అయ్యాయి." అని తన లైఫ్‌లో ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకొచ్చారు మోహన్‌బాబు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ఇంటర్వ్యూలో రాజకీయ విషయాలు, చిరంజీవితో విభేధాలు వంటి సంగతులను చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా, మోహన్‌బాబు 1952లో జన్మించారు. రాయలసీమలోని మారుమూల గ్రామం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. 1970లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు తెరకెక్కించిన 'స్వర్గం-నరకం' సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. తనదైన నటనతో ప్రతినాయకుడిగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా, పొలిటీషియన్‌గా అన్ని రంగాల్లో తనదైన ముద్రవేశారు. అలాగే సినిమాలపై ఉన్న ఆసక్తి, ప్రేమతో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి 50కి పైగా చిత్రాలను రూపొందించారు. అలానే శ్రీ విద్యానికేతన్ సంస్థల ద్వారా ఎందరో విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నారు.
అయితే ఇటీవేల మోహన్ బాబు ఇంటి పెళ్లి భాజాలు మోగాయి. ఆయన రెండో కుమారుడు మంచో మనోజ్.. వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. తన ప్రేయసి మోనిక రెడ్డిని వివాహం చేసుకున్నాడు. దగ్గరుండి మనోజ్ వివాహ వేడుకల బాధ్యతలను ఆయక అక్క మంచు లక్ష్మి.. చూసుకున్నారు.