మంచు వారి ఇంట పెళ్లి సంబరాలు మొదలైపోయాయి. అనుకున్నట్టే మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని మంచు మనోజ్ సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. కాబోయే భార్య ఫొటోను కూడా పోస్ట్ చేశారు. 'పెళ్లి కూతురిగా మౌనిక రెడ్డి' అంటూ రాసుకొచ్చారు. 'మంచు మనోజ్ వెడ్స్ మౌనిక' అని కూడా క్యాప్షన్ జోడించారు. నేడు(మార్చి 3) రాత్రి 8.30 గంటలకు వీరిద్దరు ఒక్కటి కానున్నారని తెలిసింది. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ ఇళ్లు.. పెళ్లి వేదిక కానున్నట్లు సమాచారం అందింది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు కూడా చక చకా జరుగుతున్నాయట. ఇరు కుటుంబసభ్యులతో పాటు అతి తక్కువ మంది సమక్షంలో ఈ వివాహం జరగనుంది.
ఇప్పటికే మెహందీ, సంగీత్ సహా ప్రీ వెడ్డింగ్ వేడుకలన్నీ ఘనంగా జరిగినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే చాలా కాలం నుంచే మంచు కుటుంబానికి భూమా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. అలా మనోజ్-మౌనికల మధ్య కూడా మంచి అనుబంధం ఏర్పడింది. అలా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుంది. అయితే ఇప్పుడు మరో విషయం కూడా సోషల్‌మీడియా తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. 2015లో మౌనిక రెడ్డి మొదటి పెళ్లికి మంచు మనోజ్ గెస్ట్‌గా హాజరయ్యారట. అలాంటిది ఇప్పుడు ఆమెనే ఆయన పెళ్లి చేసుకోబోతున్నారని అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ దీని గురించి చాలా మంది తెగ మాట్లాడుకుంటున్నారు.
కాగా, మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డి.. ఇద్దరికీ ఇది రెండో పెళ్లే కావడం విశేషం. గతంలో మంచు మనోజ్ ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఇద్దరు విడాకులు కూడా తీసుకున్నారు. అలానే మౌనిక రెడ్డి కూడా బెంగళూరుకు చెందిన గణేశ్ రెడ్డి అనే ఓ బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకున్నారు. వీరు కూడా మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత మనోజ్-మౌనిక మధ్య పరిచయం కాస్త రిలేషన్ షిప్‌గా మారింది. గతేడాది సెప్టెంబర్ నెలలో హైదరాబాద్‌లోని సీతాఫల్ మండిలోని గణనాథుడి మండపంలో మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి జంటగా కలిసి పూజలు కూడా చేయించారు. అప్పుడే వీరిద్దరి రిలేషన్షిప్ విషయం బయటకు వచ్చింది. అప్పటి నుంచి వీరిద్దరు కలిసి పలుసార్లు మీడియాకు కనిపించారు! అలా కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు.
ఇదీ చూడండి: భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్ పెళ్లి.. అఫిషీయల్ అనౌన్స్మెంట్