జానపదం, తెలుగు సినిమా పాటది విడదీయలేని బంధం. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఫోక్ సాంగ్ అడపాదడపా టాలీవుడ్‌లో ప్రభావం చూపిస్తూనే ఉంది. గత కొంత కాలంగా తెలుగు సినిమాను గమనిస్తే.. ఐటెం సాంగ్‌లతో పాటు ఫోక్ మట్టి పరిమళాల్ని అద్దుకుంటోంది. ఈ మధ్య తెలుగు చిత్రాల్లో అభిమానుల్ని అలరిస్తున్న జాబితాలో వీటి వాటానే ఎక్కువ. ఇక విషయానికొస్తే టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్.. తన సినిమాల్లో ఈ జానపద గీతాలను పెడతారన్న సంగతి తెలిసిందే.
'అత్తారింటికి దారేది' సినిమాలోని 'కాటమరాయుడా' సాంగ్, 'అజ్ఞాతవాసి' సినిమాలోని 'కొడకా కోటేశ్వరరావా', అరవింద సమేతలో 'రెడ్డమ్మ తల్లి', అల..వైకుంఠపురములో 'సిత్తరాల సిరపడు' లాంటి పాటలు జానపదాలను గుర్తు చేసి.. ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. సోషల్ మీడియాలోనూ రికార్డులు సృష్టించాయి.
అయితే ఇప్పుడాయన తన కొత్త సినిమాలోనూ మరో జానపద పాటను పెట్టాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఆయన తన కొత్త సినిమా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజ తర్వాత వీరి కాంబోలో హ్యాట్రిక్‌గా రూపొందుతున్న ఈ సినిమా.. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోంది. ఇందులో హీరోయిన్ పూజాహెగ్డేతో పాటు మరో కథానాయికగా శ్రీలీల నటిస్తుందనే ప్రచారాం జోరుగుతోంది. దీని గురించి ఇంకా అధికార ప్రకటన రాకుండానే ఇప్పుడు మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. అదేంటంటే.. మహేశ్-శ్రీలీల మధ్య ఓ ఫోక్ సాంగ్ పెట్టేందుకు త్రివిక్రమ్ ప్రణాళిక రచిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక సినిమా విషయానికొస్తే ఈ చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది.
ఇదీ చూడండి: ఛాన్స్ దొరికితే ఈ సారి తారక్, చరణ్‌ను ఓ ఆటాడుకుంటా!: రాజమౌళి