అగ్ర దర్శకుడు, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ (కె.విశ్వనాథ్).. ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. ఆయన కళలకు జీవం పోస్తూ ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. అవిప్రతి సినీ ప్రియుడి మదిలో చెరగని ముద్రను వేశాయి. అయితే ఆయన మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. దీంతో నేడు తెలుగు చిత్రసీమ బంద్ ప్రకటించింది. కళాతపస్విని కడసారి చూసుకునేందుకు కళాకారులు అందరికి అవకాశం కలిపిస్తూ నేడు షూటింగ్‌లన్నింటినీ నిలిపి వేసింది. ఇప్పటికే చిరంజీవి, పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు ఆయన ఇంటి వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. విశ్వనాథ్‌తో తమకున్న బంధాన్ని తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
సౌండ్ రికార్డిస్ట్‌గా సినీజీవితాన్ని ప్రారంభించారు విశ్వనాథ్. తొలిసారి పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్డిస్ట్‌గా పనిచేశారు. 1965లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకుడిగా అవకాశం లభించింది. తొలి చిత్రానికే ఆయనకు నంది అవార్డు అందుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ 9 చిత్రాలకు విశ్వనాథ్ దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.
సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం లాంటి ఆణిముత్యాలను తెలుగు చిత్రసీమకు అందించారు. ఎందరో అగ్రకథానాయకుల చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించి... ఎన్నో అవార్డులను అందుకున్నారు. సినీ రంగంలో ఆయన కృషికి 2016లో చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, అదే ఏడాదిలో పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. ఇక విశ్వనాథ్ చిత్రాల్లో ఎంతో పేరుగాంచిన స్వాతిముత్యం సినిమా ప్రఖ్యాత ఆస్కార్ (59వ)చిత్రాల బరిలో నిలిచింది.
ఇదీ చూడండి: విశ్వనాథ్ వేసుకునే ఖాకీ దుస్తుల వెనకున్న కథ ఏంటంటే?