భారతీయ చిత్ర పరిశ్రమ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమాల స్థాయి కూడా మారింది. ఇదివరకు వివిధ భాషలకు, ప్రాంతాలకు పరిమిమతమైన చిత్ర పరిశ్రమ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలుగు దిగ్గజ దర్శకుడు రాజమౌళి తీసిన 'బాహుబలి' భారత బాక్సాఫీసు వద్ద అఖండ విజయం సాధించడమే ఇందుకు తార్కాణం. ఆ తర్వాత 'కేజీఎఫ్', 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమాలు భారతీయ సినిమా దృక్పథాన్నే మార్చేశాయి.
ఇప్పుడు నిర్మాతలు ఖర్చుకు వెనకాడటం లేదు. అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. ఇలా సినిమా స్థాయి మారడం నటులకు కలసివచ్చి భారీ పారితోషికాలు అందుకుంటున్నారు. అయితే ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు నటిస్తున్న నాలుగు సినిమాల బడ్జెట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆ నాలుగు చిత్రాల బడ్జెట్ ఏకంగా రూ.875 కోట్లు!
హృతిక్ రోషన్.. ఈ పేరు చాలా మంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 'క్రిష్' సినిమా ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకముందే 2000 సంవత్సరంలో 'కహో నా ప్యార్ హై' అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి చిత్రంతోనే అద్భుత విజయాన్ని అందుకున్నారు హృతిక్ రోషన్. తర్వాత ఇతడి పేరు బాలీవుడ్లో మారు మోగిపోయింది.
మొదటి విజయాన్ని అందుకున్న తర్వాత.. 'లక్ష్య', 'జోధా అక్బర్', 'సూపర్ 30', 'కాబిల్', 'ధూమ్', 'గుజారిష్', 'జిందగీ న మిలేగీ దుబారా', 'క్రిష్'.. మొదలైన చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే అప్పుటి నుంచి ఇప్పటివరకు అంచెలంచెలు ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు అతడి రాబోయే నాలుగు సినిమాల బడ్డెట్ రూ.875 కోట్లంటే.. అతడి సినిమా మార్కెట్ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే అతడి రాబోయే నాలుగు చిత్రాల బడ్జెట్.
1. విక్రమ్ వేద
తమిళంలో విజయం సాధించిన 'విక్రమ్ వేద' సినిమాను అదే పేరుతో హిందీలోకి రీమేక్ చేశారు. ఒరిజినల్ సినిమాలో విజయ్ సేతుపతి, ఆర్. మాధవన్ నటించారు. హిందీలో హృతిక్ రోషన్, సైప్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమ్ వేధ సినిమా.. బేతాల విక్రమార్కుడు అనే పౌరానిక కథ ఆధారంగా తెరకెక్కింది. తమిళ్లో ఈ సినిమా రూ.11 కోట్లతో తెరకెక్కి.. రూ.60 కోట్ల వసూళ్లు రాబట్టింది. అయితే హిందీలో ఈ చిత్ర నిర్మాణానికి రూ.175 కోట్లు ఖర్చు చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 30 విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఎంతమేర కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో వేచిచూడాలి.
2. వార్
భారీ యాక్షన్ సీక్వెన్సులతో తెరకెక్కిన చిత్రం వార్. ఇందులో హృతిక్‌తో పాటు టైగర్ ష్రాఫ్ నటించారు. ఈ సినిమా బాక్సీఫీసు వద్ద మంచి విజయం సాధించి.. రూ.451 కోట్ల కలెక్షన్ల మార్క్‌ను దాటింది. ఈ ఇద్దరికీ వారి కెరీర్లో అన్నిటికంటే ఎక్కువ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిపెట్టిన సినిమా ఇదే. అయితే వీరిద్దరు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మొదటి పార్ట్ దాదాపు రూ.175 కోట్లతో తెరకెక్కింది. అయితే రెండో పార్ట్ బడ్జెట్ దాదాపు రూ.200 కోట్లు దాటుతుందని సమాచారం.
3. ఫైటర్
హృతిక్ నుంచి రాబోతున్న మరో చిత్రం 'ఫైటర్'. ఇందులో మొదటి సారిగా దీపికా పదుకొణెతో స్క్రీన్ పంచుకోబోతున్నారు. ఈ సినిమా భారత వైమానికి దళ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ సినిమాను దాదాపు రూ.250 కోట్లతో తీస్తున్నారని సమాచారం. "ఈ సినిమాతో మేము ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల వద్దకు భారత సినిమాను తీసుకెళ్లబోతున్నాము. అయితే అలాంటి పాత్రల కోసం ఇద్దరు నటులు కఠిన శిక్షణ తీసుకుంటున్నారు. వివిధ రకాల మార్షల్ అర్ట్స్ నేర్చు కుంటున్నారు" అని మేకర్స్ ఓ సందర్భంలో చెప్పారు.
4. క్రిష్
'కోయి మిల్ గయా' అనే సినిమా 2003లో సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చింది. ఆ సినిమా విజయం సాధించిన తర్వాత 'క్రిష్' అనే సినిమా తీశారు. అది కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో 'క్రిష్ 3' తీశారు. ఇలా ఇండియన్ సూపర్ హీరో అన్ని వయసులు ప్రేక్షకులను అలరించింది. దీంతో మేకర్స్ పార్ట్ 4 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నానని మేకర్స్ చెప్పారు. తాము సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు రాకేశ్ రోషన్ ఓ సందర్భంలో తెలిపారు.
అయితే ఈ సినిమాకు భారీగా వీఎఫ్ఎక్స్ హంగులు సమకూర్చుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం నిర్మాణం కోసం దాదాపు రూ.250 కోట్ల వరకు ఖర్చు అవ్వచ్చని అంచనా. ఏది ఏమైనా ఇలాంటి భారీ ఖర్చులతో సినిమాలు మంచి వినోదం పంచేందుకు ముందుకు రావడం శుభ పరిణామమే. అయితే పారితోషకాలకు కాకుండా.. ఎక్కువ మొత్తాన్ని సినిమాకు హంగులు అద్దడంలో పెడితే బాగుంటుందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి: తెలుగు అందం చిరునామా.. ఈ బుల్లితెర భామ