దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాతో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. ఒక్కసారిగా చెర్రీ ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. హాలీవుడ్‌లోనూ చరణ్ పేరు మార్మోగిపోతోంది. అయితే తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే తప్పకుండా టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటిస్తానని తెలిపారు. క్రీడానేపథ్యంతో తెరకెక్కిన సినిమా చేయాలన్న కల తనకు చాలా కాలంగా ఉందని వెల్లడించారు.
అమెరికాలో అట్టహాసంగా జరిగిన ఆస్కార్ ప్రదానోత్సవ వేడుకల్లో పాల్గొన్న రామ్‌చరణ్, ఉపాసన దంపతులు.. శుక్రవారం ఉదయం దిల్లీ చేరుకున్నారు. ఆ సమయంలో మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. దిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే ఛానల్ నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సులో రామ్‌చరణ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ బేసెడ్ సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కానీ ఆ కోరిక మాత్రం తీర లేదని రామ్‌చరణ్ చెప్పారు. భవిష్యత్తులో తప్పకుండా ఏదో ఒక క్రీడానేపథ్య సినిమా చేస్తానని అన్నారు.
విరాట్ కోహ్లీ బయోపిక్‌పై అడిగిన ప్రశ్నకు రామ్‌చరణ్ బదులిచ్చారు. ఛాన్స్ దొరికితే తప్పకుండా కోహ్లీ బయోపిక్‌లో నటిస్తానని అన్నారు. లుక్ పరంగా తాను కొంత కోహ్లీకి దగ్గరగా కనిపిస్తానని చరణ్ అన్నారట. కోహ్లీ రోల్‌ను సిల్వర్ స్క్రీన్‌పై పోషించే అవకాశం రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ అంటే తనకు ఇష్టమని, ముంబయి ఎప్పుడూ వచ్చినా సల్మాన్‌ను కలుస్తుంటానని తెలిపారు. బేటా అంటూ తనను ఆత్మీయంగా సల్మాన్ పిలుస్తుంటారని చరణ్ వెల్లడించారు.
మరోవైపు, హీరో రామ్‌చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను శుక్రవారం సాయంత్రం.. మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అమిత్ షాను చిరంజీవి, చరణ్.. శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించారు. అమిత్ షా కూడా రామ్‌చరణ్‌కు చిరు సత్కారం చేశారు. అనంతరం వీరు ముగ్గురు.. పలు విషయాలపై చర్చించారు. దీంతో సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్సీ 15' లో నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకుంటోంది. కర్నూల్, హైదరాబాద్ లాంటి లొకేషన్లలో ఇటీవలే షూటింగ్ కూడా జరిగింది. మార్చి 27వ తేదీన రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
మరోవైపు, టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ ఆడుతున్నాడు. అయితే విరాట్ వెబ్‌సిరీస్‌పై ఆ మధ్య చాలా వార్తలు వచ్చాయి. పలువురు నటులు.. తమకు అవకాశం వస్తే కోహ్లీ బయోపిక్‌లో నటిస్తామని ప్రకటించారని ఊహాగానాలు వచ్చాయి. బాలీవుడ్ యాక్టర్లు కార్తీక్ ఆర్యన్, షాహిద్ కపూర్, టాలీవుడ్ నటులు విజయ్‌దేవరకొండ, అక్కినేని అఖిల్ వీరిలో ఎవరైనా నటిస్తే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు. మరి రామ్‌చరణ్ అన్నట్లు.. ఆయనకు ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి.