18 ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఛత్రపతి సినిమా.. బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. వర్షం సినిమాతో తొలి హిట్ అందుకున్న పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌కు ఛత్రపతి తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈ సినిమాతోనే ప్రభాస్‌కు మాస్ ఆడియెన్స్ విపరీతంగా పెరిగిపోయారు. అలాంటి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాను టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. హిందీలో రీమేక్ చేస్తున్నారు.
మాస్ సినిమాలకు పెట్టింది పేరైనా వి.వి. వినాయక్.. ఛత్రపతి హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం ప్రకటన వచ్చినా.. ఇంతవరకు ఈ చిత్రం విడుదల కాలేదు. ఇంక థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుద్దన్న వార్తలు కూడా వచ్చాయి. అసలు ఎలాంటి అప్డేట్లు రాకపోవడంతో ఈ సినిమా ఉందన్న విషయమే చాలా మంది మర్చిపోయారు!
ఇలాంటి సమయంలో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను సోమవారం ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. హిందీ రీమేక్‌కు కూడా ఒరిజినల్ టైటిల్ అయిన ఛత్రపతినే ఫిక్స్ చేశారు. వేసవి కానుకగా మే 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
అయితే ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ కండలు తిరిగిన దేహంతో చేతిలో చెంబు పట్టుకుని సముద్రం వైపు తిరిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే సినిమాపై మేకర్స్ మంచి బజ్ క్రియేట్ చేశారు. ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతి లాల్ నిర్మిస్తున్నారు. మరి ఈ రీమేక్ ఒక్క హిందీ భాషలోనే విడులవుతుందా? లేదంటే పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతుందా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక చాలా కాలంగా శ్రీనివాస్‌కు తెలుగులో విజయాలు లేవు. రాక్షసుడు సినిమా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత నటించిన అల్లుడు అదుర్స్ డిజాస్టర్‌గా నిలిచింది. అంతకు ముందు జయ జానకీ నాయక, సాక్ష్యం, కవచం, సీత వంటి చిత్రాలు సైతం నిరాశపరిచాయి. దీంతో బెల్లంకొండ తెలుగులో హీరోగా ఇంకా నిలదొక్కుకోలేదు. ఇప్పుడు హిందీలో రాణించేందుకు సిద్ధమవడం విశేషం. అయితే ఆయన తెలుగులో నటించిన యాక్షన్ చిత్రాలకు హిందీలో డబ్బింగ్ వెర్షన్‌లో యూట్యూబ్‌లో మంచి స్పందన లభించింది. కొంత మార్కెట్ కూడా ఏర్పడింది. ఆ ధైర్యంతో ఛత్రపతిని హిందీలో రీమేక్ చేస్తున్నారట.
ఇటీవల కాలంలో రీమేక్‌లు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. మరి ఛత్రపతి హిందీలో ఆదరణ పొందుతుందా అనేది చూడాలి. మరోవైపు వినాయక్ కూడా ఖైదీ నెంబర్ 150 తర్వాత సక్సెస్ లేదు. దీంతో ఆయనకు కూడా హిట్ కావాలి. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్, వినాయక్ ఈ సినిమాపైనే ఆధార పడ్డారని చెప్పొచ్చు! దీంతోపాటు బెల్లంకొండ శ్రీనివాస్ స్టూవర్ట్ పురం దొంగ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది.