Hardik Pandya Ram Charan : సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులకు ఆతిథ్యమిచ్చి.. ఘనంగా సత్కరించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొన్న నటుడు రామ్‌చరణ్ ఇప్పుడిదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ నిమిత్తం హైదరాబాద్‌కు విచ్చేసిన భారత క్రికెటర్ల కోసం చరణ్ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఉప్పల్ మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌తోపాటు పలువురు ఆటగాళ్లు చరణ్ ఇంటికి చేరుకొని సందడి చేశారని ఓ పోస్ట్ వైరల్ అయ్యింది.
ఈ సందర్భంగా ఆటగాళ్లను సన్మానించి.. చరణ్ వారితో కాసేపు సరదాగా మాట్లాడారు. రామ్‌చరణ్ - ఉపాసన దంపతులతోపాటు మెగా కుటుంబసభ్యులు, పలువురు సెలబ్రిటీలు సైతం ఈ పార్టీలో పాల్గొన్నారని.. త్వరలోనే ఈ పార్టీ ఫొటోలను చరణ్ అధికారికంగా షేర్ చేయనున్నారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు, హార్దిక్ పాండ్య.. రామ్‌చరణ్ నివాసంలోని ఓ వ్యక్తితో దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
సినిమాల విషయానికి వస్తే 'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. పొలిటికల్, సామాజిక అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో చరణ్ విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
ఇవీ చదవండి: వైట్‌బాల్ క్రికెట్లో కోహ్లీ రికార్డు.. టీ20ల్లో ఈ ఏడాది ఛాంపియన్ అతడే..
'రవి భాయ్.. నీవు నేర్పిన విద్యయే అది!'.. మాజీ కోచ్‌కు డీకే చురకలు!!