Godfather Movie : ఒక భాషలో విజయవంతమైన చిత్రాలు మరొక భాషలో రీమేక్ కావడం సహజం. మాతృకలోని పాత్రలు రీమేక్‌లో ఎవరెవరు నటిస్తున్నారన్న ఆసక్తి ప్రేక్షకుడికి ఉంటుంది. ఇక చిరంజీవిలాంటి అగ్ర కథానాయకుడి చిత్రమైతే ఆ ఆసక్తి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఆయన కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గాడ్‌ఫాదర్'. మలయాళంలో విజయం సాధించిన 'లూసిఫర్' రీమేక్‌గా ఇది వస్తోంది. మరి మలయాళంలో చేసిన పాత్రలను తెలుగులో ఎవరెవరు చేస్తున్నారో చూసేద్దామా!
మలయాళంలో స్టీఫెన్ గట్టుపల్లి అలియాస్ ఖురేషి అబ్రహాం పాత్రలో అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ నటించారు. అదే పాత్రను ఇక్కడ బ్రహ్మగా చిరంజీవి చేస్తున్నారు.
మాతృకలో ప్రతినాయకుడు బాబీగా వివేక్ ఒబెరాయ్ నటించారు. పైకి మంచిగానే కనిపించే ఈ పాత్రలో విభిన్న షేడ్స్ ఉంటాయి. తెలుగులో ఈ క్యారెక్టర్ జయదేవ్‌గా యువ నటుడు సత్యదేవ్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర ప్రియదర్శిని రామదాసుగా మంజూవారియర్ కనిపించారు. కథానాయకుడు (మోహన్‌లాల్) సోదరిగా ఆమె నటించారు. తెలుగులో ఇదే పాత్రను చిరు సోదరిగా నయనతార చేస్తుండటం గమనార్హం. అంతేకాదు, మలయాళంతో పోలిస్తే మరింత శక్తిమంతంగా ఈ పాత్రను మోహన్‌రాజా తీర్చిదిద్దారు.
ఈ కథలో మరో బలమైన పాత్ర మసూద్. మలయాళంలో ఈ క్యారెక్టర్‌ను దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ చేశారు. తెలుగులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ చేస్తున్నారు. సినిమాకే ఈ పాత్ర ఓ ఊపు తెస్తుందని టాక్.
అవినీతి, స్త్రీలోలుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రను 'లూసిఫర్'లో జాన్ విజయ్ చేయగా, తెలుగులో సముద్రఖని చేస్తున్నారు.
రాజకీయ నాయకుడు వర్మ పాత్రను మలయాళంలో సాయికుమార్ చేయగా, తెలుగులో మురళీశర్మ చేస్తున్నారు.
'లూసిఫర్'లో కథను కీలక మలుపుతిప్పే పాత్ర జతిన్ రామదాస్. పీకే రామదాసు కుమారుడి పాత్ర ఇది. తండ్రి మరణం తర్వాత అమెరికా నుంచి తిరిగి వచ్చి పార్టీ పగ్గాలు చేపడతాడు. తెలుగులో ఈ పాత్ర ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో ఎవరైనా చేస్తున్నారా? లేక ఈ పాత్రను పూర్తిగా తీసేశారా? అనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది.
ఇక వీరు కాకుండా బ్రహ్మాజీ, సునీల్, పూరి జగన్నాథ్, తాన్య రవిచంద్రన్ తదితరులు నటిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: 'ఈ ఏడాది బ్రహ్మాస్త్ర సినిమానే 'నెంబర్ 1'.. పార్ట్2 విడుదల అప్పుడే'