వయసు రిత్యా అనారోగ్య సమస్యలతో సూపర్‌స్టార్ కృష్ణ ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణ భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు, అభిమానుల సందర్శన తర్వాత బుధవారం మధ్యాహ్నం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
అయితే, తన తాతయ్యను కడసారి చూసుకోలేకపోయినందుకు కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అమెరికాలో ఉంటోన్న జయకృష్ణ నిన్న అర్ధరాత్రి సమయంలో ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే కార్యక్రమాలన్నీ పూర్తి కావడంతో అతడు కాస్త ఎమోషనల్ అయ్యాడు. కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాడు. ఘట్టమనేని కుటుంబం గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో సంతాప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కేవలం కుటుంబసభ్యులు, సినీ పరిశ్రమకు చెందిన కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కృష్ణ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
కాగా, ఐదున్నర దశాబ్దాలపాటు చిత్రసీమను ఏలిన నటశేఖరుడు మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆదివారం అర్ధరాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు వెంటనే ఆయనకు సీపీఆర్ చేసి కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటకు తెచ్చారు. అయితే కీలకమైన అవయవాలు పనిచేయకపోవడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై వైద్యం అందించారు. కృష్ణ క్షేమంగా తిరిగి రావాలని అభిమానులు శ్రేయోభిలాషులు ప్రార్థించారు.
సూపర్‌స్టార్‌ను బతికేందుకు వైద్యులు గంటల తరబడి శ్రమించినా ఫలితం లేకపోయింది. మంగళవారం తెల్లవారుజామున 4.09 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. తర్వాత కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి కృష్ణ పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
ఇదీ చూడండి: కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించిన ప్రముఖులు తారక్ బన్నీ రామ్‌చరణ్ ఇంకా ఎవరెవరు వచ్చారంటే