''కష్టపడి సినిమా చేయడం.. ప్రేక్షకుల నిర్ణయానికి వదిలేయడం... నా ప్రయాణం ఈ తరహాలోనే ఉంటుంది. బాక్సాఫీస్ లెక్కల్ని నమ్మను కానీ.. నిర్మాతకి మాత్రం కచ్చితంగా డబ్బు రావాల్సిందే. సెట్‌కి వెళ్లినప్పుడు ఆ కోణంలోనే ఆలోచిస్తుంటా'' అంటున్నారు అగ్ర కథానాయకుడు వెంకటేష్. వినోదం పంచడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి ఉందని నిరూపించిన కథానాయకుడాయన. 'ఎఫ్2'తో నవ్వులు పండించిన ఆయన... 'ఎఫ్3'లో రేచీకటి బాధితుడిగా కనిపించనున్నారు. వరుణ్‌తేజ్‌తో కలిసి ఆయన నటించిన 'ఎఫ్3' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
'ఎఫ్3' ప్రచార చిత్రాలు చూస్తుంటే 'ఎఫ్2' కంటే హుషారుగా నటించినట్టు అనిపిస్తోంది. మీరేమంటారు?
'ఎఫ్2' తర్వాత నేనెక్కడైనా కనిపిస్తే కుటుంబమంతా వచ్చి పలకరిస్తుంటారు. తల్లిదండ్రులు వచ్చి మాట్లాడతారేమో అనుకుంటే... వాళ్ల పిల్లలు వచ్చి 'ఎఫ్2'ని అన్ని సార్లు చూశాం, ఇన్నిసార్లు చూశామని నా మేనరిజమ్స్‌ని ప్రదర్శించి చూపిస్తుంటారు. వాళ్లంతా నా 'బొబ్బిలిరాజా' చూసినవాళ్లు కాదు, నా 'ప్రేమించుకుందాం రా' చూసినవాళ్లూ కాదు. తర్వాత తరం పిల్లలు. వాళ్లకి కూడా ఇది నచ్చిందని తెలిసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంటుంది. నటుడిగా నేను ఈతరంలోకి కూడా ప్రవేశించాను కదా అని మరింత నమ్మకం కలుగుతుంటుంది.
కామెడీ కథల్లో నటిస్తున్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?
ప్రతి సినిమా నాకు తొలి సినిమానే. కొన్ని వారాలపాటు అదే ఆలోచనతోనే ఉంటూ పనిచేస్తుంటా. కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. మనసులో ఏదీ పెట్టుకోకుండా స్వేచ్ఛగా ఉండాలి. అప్పుడే ఆ హావభావాలు పండుతాయి. నేను హీరోని, వెంకటేష్‌ని అనే విషయాల్ని మనసులో ఎప్పుడూ పెట్టుకోను. సహజంగా ఉంటాను. వినోదాన్ని ఆస్వాదిస్తూ పనిచేస్తాను. 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు', 'అబ్బాయిగారు', 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి'... ఈ సినిమాలన్నీ అలా చేసినవే. నాలోని ఆ లక్షణమే దర్శకులకి నచ్చుతుందేమో. అందుకే వాళ్లు ఇలాంటి వినోదాత్మకమైన కథలతో నన్ను సంప్రదిస్తుంటారు.
'దృశ్యం2', 'నారప్ప' గాఢతతో కూడిన కథలు. వాటి తర్వాత ఈ సినిమా చేయడం మరింత సులభంగా అనిపించిందేమో కదా?
అవి వేరే మూడ్‌లో సాగే సినిమాలు. ఇది భిన్నమైన కథ. ఎందుకో కామెడీ చేయాలని సెట్స్‌కి వెళ్లినప్పుడు ఏదో మేజిక్ జరుగుతుంది. క్రేజీగా అనిపిస్తుంది, వెంటనే ఓ రకమైన ఉత్సాహంతో పనిచేస్తుంటా. బయట కూడా నేను స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ ఓ జోకర్‌లాగా, సరదాగా గడుపుతుంటా. ఆ ఉత్సాహం అలా ఉంటుంది, నా చుట్టుపక్కలవాళ్లు కూడా అలా ప్రోత్సహిస్తుంటారు. ఆ రెండు సినిమాలు ఓటీటీలో విడుదల కావడంతో చాలా మంది చూడలేదు. ఇప్పుడు థియేటర్లో ఈ సినిమా విడుదల కానుండడంపై చాలా సంతోషంగా ఉన్నా. ఇలాంటి నాన్‌స్టాప్ వినోదాత్మక సినిమాల్ని ఎక్కువమంది మధ్య చూడటంలో ఓ కిక్ ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నప్పుడు ఆ హంగామానే వేరు. ఇప్పటికే 'ఎఫ్2' పాత్రల్ని ప్రేక్షకులు సొంతం చేసుకున్నారు కాబట్టి, 'ఎఫ్3'లో ఆ వినోదాన్ని రెండింతలు, మూడింతలుగా ఆస్వాదిస్తారు. తొలిసారి రేచీకటి బాధితుడిగా ఓ మంచి పాత్రని చేశా.
డబ్బు చుట్టూ తిరిగే కథ కదా, డబ్బు గురించి మీరేం చెబుతారు?
మానవుల్లో ఆశ సహజం. అది తప్పేం కాదు. కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఏదీ వేగంగా, సులభంగా, అడ్డ దారుల్లో రాదని! అది తెలుసుకోకుండా ప్రతి ఒక్కరూ వేగంగా సంపాదించాలని చూస్తుంటారు. ఆ అవకాశాలు లేనప్పుడు వాడే కొత్తగా ఏదో సృష్టించి, ఇంకో సమస్యని ఎదుర్కొంటాడు. ఆ క్రమంలో కొన్ని కొత్త పాఠాలు నేర్చుకోవాలి. లేదంటే దాని పర్యవసనాలు ఎదుర్కొంటూనే ఉంటాడు. సరైన మార్గంలో సరైన పనులు చేస్తున్నప్పుడు నిజంగా మనకు ఏది అవసరమో, దేనికి అర్హులమో అదే ఇస్తుంది ఈ విశ్వం అని నమ్ముతాన్నేను.
ఈమధ్య వస్తున్న సినిమాలు, పాన్ ఇండియా ట్రెండ్‌పై మీ అభిప్రాయమేమిటి?
విభిన్నమైన సినిమాలొస్తున్నాయి. అయితే ఏ విషయం గురించీ ఎక్కువగా ఆలోచించకూడదు. ప్రతి సినిమా ప్రత్యేకమైనదే. ఇక్కడ ప్రేక్షకులు ముఖ్యం, వాళ్లని గౌరించాలి. మనం ఏం చేసినా వాళ్లకు నచ్చాలి. ట్రెండ్ పేరుతో నేను ఆటలు ఆడను, చూస్తానంతే. పాన్ ఇండియా చిత్రాలైనా, ఇంకేదైనా మంచి బృందం కుదరాలి. అలాంటివి కుదిరినప్పుడు మాత్రం వదులుకోకూడదు.
కామెడీ పరంగా మీపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? దర్శకుడు అనిల్ రావిపూడి పనితీరు గురించి ఏం చెబుతారు?'
మసాలా' సినిమాకి రచయితగా పని చేసినప్పట్నుంచి అనిల్‌ని గమనిస్తున్నా. సింపుల్‌గా రాస్తాడు, అతని సంభాషణలు కూడా సహజమైన నటనని ప్రదర్శించేందుకు దోహదం చేస్తుంటాయి. ఈవీవీ, శ్రీనువైట్ల... వీళ్లందరిని పోలిన టైమింగ్ అతనిలో ఉంటుంది. అనిల్‌లోని స్పష్టత నాకు బాగా నచ్చుతుంది. కామెడీ పరంగా నాపై చాలామంది ప్రభావం ఉంది. నేను యువకుడిగా ఉన్న రోజుల్లో అల్లు రామలింగయ్య నటన, ఆయన సంభాషణలు చెప్పే విధానం భలే నచ్చేది. ఆ తర్వాత జానీలీవర్. ఇలా కొంతమంది మాట్లాడే విధానంలోనే కామెడీ పండుతుంటుంది. నేనూ డబ్బింగ్‌లో ఆ తరహా ప్రయత్నం చేస్తుంటా. అలా ఒకరని కాదు, చాలా మంది ప్రభావమే ఉంటుంది. నేను మంచి విద్యార్థిని. పరిసరాల్ని, మనుషుల్ని సునిశితంగా పరిశీలిస్తుంటా. అది నటించేటప్పుడు చాలా మేలు చేస్తుంటుంది.
మల్టీస్టారర్ సినిమాలపై మీ అభిప్రాయమేమిటి? వరుణ్‌తేజ్‌తో కలిసి చేసిన ప్రయాణం గురించి ఏం చెబుతారు?
కథలు బాగుంటే అందరితోనూ చేస్తాను. అలాంటి సినిమాలు ఆడినా ఆడకపోయినా కథ ఆసక్తికరంగా ఉంటే కచ్చితంగా చేయాల్సిందే. మరొక హీరోతో కలిసి పనిచేయడాన్ని నేను బాగా ఆస్వాదిస్తుంటా. వరుణ్‌తేజ్‌తో కలిసి చేసిన ఈ ప్రయాణం అద్భుతం అనిపించింది. మా కలయికలో వచ్చిన తొలి సినిమా ప్రయాణాన్ని ఆస్వాదించారంతా. 'ఎఫ్3'లో వరుణ్ పాత్ర ఇంకా బాగుంటుంది.
రానాతో కలిసి నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్‌సిరీస్ చేశారు. ఏదైనా షో చేసే ఆలోచన ఉందా?
కొవిడ్ సమయంలో రానా నెట్‌ఫ్లిక్స్ షో గురించి చెప్పాడు. అద్భుతంగా అనిపించింది. దక్షిణాదిలో ఆ తరహా సిరీస్ ఎవ్వరూ చేయలేదు. అప్పుడు చేతిలో వేరే పని కూడా లేదు కాబట్టి చేశాం. కెరీర్‌లో తొలిసారి ఓ భిన్నమైన పాత్రలో కనిపిస్తా. ఇక షోస్ గురించి కూడా సంప్రదించారు కానీ నేనే చేయలేదు. ఏదైనా ఓ డైలాగ్ ఇచ్చి రెండు మూడుసార్లు అదే చెప్పమంటే నావల్ల కాదు. ఏదైనా సింగిల్ టేక్‌లోనే చేయడానికి ఇష్టపడతాను. షోస్ చేయడానికి అదే ఇబ్బంది.
తదుపరి మీరు చేయబోయే సినిమాల విశేషాలేమిటి?
సితార, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థల్లో సినిమాలు చేస్తున్నా. సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించే సినిమా మొదలవబోతోంది.
ఇదీ చూదవండి: అదీ ఉపాసన రేంజ్ అంటే.. అత్యంత ఖరీదైన కారు కొనుగోలు.. ఎంతంటే?