Singer K K Death Reason: కోల్‌కతాలో ప్రదర్శన ఇస్తూ కుప్పకూలిన ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నథ్కు (కేకే) చాలా కాలంగా గుండె సమస్యలున్నాయా? ఆయన రక్తనాళాలు పూడుకుపోయాయా? చాలా సార్లు నొప్పి వచ్చినా జీర్ణ సమస్యగా భావించి మాత్రలు వాడారా..? అదే ఆయన అకాల మరణానికి దారి తీసిందా..? అవుననే అంటున్నారు వైద్యులు. సకాలంలో తన గుండె సమస్యను ఈ 53 ఏళ్ల గాయకుడు గుర్తించకపోవడమే అనర్థానికి కారణమంటున్నారు. దీంతోనే మంగళవారం కోల్‌కతాలో సంగీత ప్రదర్శన అనంతరం అపస్మారక పరిస్థితుల్లోకి వెళ్లిపోయారని, ఆ సమయంలో సీపీఆర్ (గుండెపై చేతులతో బలంగా ఒత్తడం) ప్రక్రియ నిర్వహించి ఉంటే బతికేవారని శవపరీక్ష నిర్వహించిన వైద్య బృందంలోని వైద్యుడు గురువారం తెలిపారు. ''ప్రధాన ఎడమ గుండె ధమనిలో పెద్ద పూడిక(80 శాతం) ఉంది. చాలా ధమనుల్లో, ఉప ధమనుల్లోనూ ఆయనకు చిన్న చిన్న పూడికలు ఉన్నాయి. ప్రదర్శన సమయంలో అతి ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో రక్త ప్రసరణ ఆగి.. గుండెపోటుకు దారి తీసింది’’ అని ఆ వైద్యుడు వెల్లడించారు. ప్రదర్శనలో కేకే చాలా సార్లు వేదికపై వేగంగా నడుస్తూ.. ప్రేక్షకులతో పాటు నృత్యాలు చేశారు. ఈ అతి ఉద్వేగం కారణంగా ఆయన గుండె లయ దెబ్బతిందని, దీంతోనే స్పృహ తప్పారని.. ఆ సమయంలో ఎవరైనా సీపీఆర్ చేసుంటే బతికేవారని వైద్యుడు పేర్కొన్నారు.
పొరపాటు పడ్డారా: పోస్టుమార్టం నివేదికలో మరో కీలక విషయం వెల్లడైంది. కేకే చాలా కాలం నుంచి యాంటాసిడ్స్ వాడుతున్నట్లు తేలింది. బహుశా తన నొప్పిని ఆయన జీర్ణసమస్యగా భావించి ఉంటారని ఆ వైద్యుడు తెలిపారు. మరోవైపు ఆయన మరణం తీవ్ర గుండెపోటుతోనే సంభవించిందని వైద్యులు నిర్ధారించారు.
అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు: కుటుంబ సభ్యులు, స్నేహితులు, బాలీవుడ్ ప్రముఖుల అశ్రునయనాల మధ్య గాయకుడు కృష్ణకుమార్ కున్నథ్ అంత్యక్రియలు గురువారం ముంబయిలోని వెర్సోవా హిందూ శ్మశాన వాటికలో జరిగాయి. అంత్యక్రియల సమయంలో కేకే కొడుకు నకుల్‌ను ఓదార్చటం ఎవరితరమూ కాలేదు.
ఇదీ చదవండి: 'సర్కారువారి పాట' కూడా ఓటీటీలో అదే బాట