Director Siddique Passed Away : దక్షిణాది సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళీ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సిద్ధీక్ (63) గుండెపోటుతో కన్నుమూశారు. కొచ్చిలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సిద్ధీక్ కుటుంబ సభ్యులు మీడియాకు మంగళవారం తెలియజేశారు. వివిధ ఆరోగ్య కారణాలతో సిద్ధీక్ గత నెల రోజులుగా కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుకున్నారు. అయితే, సోమవారం ఆయన గుండెపోటుకు గురయ్యారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మంగళవారం రాత్రి 9.13 గంటలకు సిద్ధీక్ తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించాయి.
సిద్ధీక్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధిక్కు భార్య సజిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అభిమానుల సందర్శనార్థం సిద్ధీక్ పార్థివదేహాన్ని కొచ్చిలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంచనున్నారు. సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి.
Siddique Lal Movies : 1960 ఆగస్టు 1న కొచ్చిలో జన్మించిన సిద్ధీక్ చదువు పూర్తయిన తర్వాత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సీనియర్ దర్శకుడు ఫాజిల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొన్నాళ్లు పనిచేశారు. ఆ తర్వాత సిద్ధీక్ తన స్నేహితుడు లాల్తో కలిసి అనేక హిట్ సినిమాలను తెరకెక్కించారు. దీంతో వీరిద్దరి జంట సిద్ధీక్-లాల్ ప్రసిద్ధి చెందింది. 'రామ్‌జీరావు స్పీకింగ్', 'ఇన్ హరిహర్ నగర్', 'గాడ్ ఫాదర్', 'వియత్నాం కాలనీ', 'కాబూలీవాలా' వంటి సిద్ధిక్-లాల్ సినిమాలు భారీ విజయాలు సాధించాయి.
Siddique Director Movies : సిద్ధీక్.. 'హిట్లర్', 'ఫ్రెండ్స్', 'క్రానిక్ బ్యాచిలర్', 'బాడీగార్డ్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. సిద్ధీక్ 2011లో మలయాళంలో తెరకెక్కించిన 'బాడీగార్డ్' సినిమా సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఇదే పేరుతో సల్మాన్ హీరోగా హిందీలో సినిమా తీశారు. అది కూడా కలెక్షన్ల వర్షం కురిపించడం వల్ల తెలుగు, తమిళ్లోనూ ఆ సినిమాను రీమేక్ చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని వెంకటేశ్ హీరోగా అదే పేరుతో తెరకెక్కించారు. తమిళంలో విజయ్ హీరోగా 'కావలన్' పేరుతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈయన దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు చిత్రం 'మారో'. ఇందులో నితిన్ కథానాయకుడిగా నటించారు. సిద్ధీక్ కొన్ని సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించారు.
19రోజుల్లో మ్యారేజ్ డే.. గుండెపోటుతో నటుడి భార్య కన్నుమూత.. వెకేషన్లోనే..
'లగాన్' ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య.. సొంత స్టూడియోలోనే..