Vijaydevarkonda Miketyson fight బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్.. రింగ్‌లో తన పంచ్‌లతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. త్వరలోనే ఆయన లైగర్‌తో వెండితెరపై సందడి చేయనున్నారు. మరి, ఆయన విజయ్‌దేవరకొండతో ఫైట్ చేస్తారా.. లేదా? ఒకవేళ ఉంటే ఆ పోరాటం రింగ్‌లోనా, బయటా? అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటం వల్ల సినీ ప్రియుల్లో ఉత్కంఠత పెరుగుతోంది. అయితే ఈ విషయమై దర్శకుడు పూరి జగన్నాథ్ స్పందించారు. విజయ్, మైక్ టైసన్ మధ్య ఫైట్ సీక్వెన్స్ ఉందని, కానీ అది కేజ్‌లో కాదన్నారు. కేజ్ నేపథ్యంలో సాగే పోరాటాల్లో ఇతర నటులు కనిపిస్తారన్నారు. ఈ సినిమాలో నటించేందుకు టైసన్‌ను ఎలా ఒప్పించారో ఆయన మాటల్లోనే..
"ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం మైక్ టైసన్‌ను తీసుకోవాలని ఎందుకు అనిపించిందో మాకే తెలియదు. తనని ఈ సినిమాలో నటింపజేసేందుకు మాకు సంవత్సరం పట్టింది. ముందుగా ఆయన టీమ్‌కి వందల సంఖ్యలో ఈ- మెయిల్స్ పంపేవాళ్లం. ఎన్నోసార్లు జూమ్ కాల్స్ మాట్లాడేవాళ్లం. 'టైసన్ ఇది చేయరు.. అది చేయరు. మాకు మొత్తం స్క్రిప్టు పంపండి' అని టైసన్ టీమ్ అడిగేది. అలా.. చివరకు ఎలాగో మా ప్రయత్నం ఫలించింది. చిత్రీకరణ కోసం లాస్‌వేగాస్ వెళ్లాం. మైక్ టైసన్ వస్తున్నారని చెప్తే ఈ సినిమాకి పనిచేసిన అక్కడి సాంకేతిక నిపుణులు నమ్మలేదు. 'సర్.. టైసన్ వస్తారా? ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి?' అని విజయ్ నా దగ్గరకు వచ్చి అనగానే భయమేసింది. అంతా సిద్ధం చేశాం.. ఇప్పుడు టైసన్ రాకపోతే ఏం చేయాలనే టెన్షన్‌లో ఉండగా టైసన్ ఎంట్రీ ఇచ్చాడు. 'ఇక్కడ ఏం జరుగుతోంది?' అంటూ సందడి చేశాడు. లెజెండ్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కడం సంతోషం. బ్రూస్‌లీ, మైకేల్ జాక్సన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి టైసన్. ఆయన పక్కన కూర్చొని నేనూ విజయ్ ఆశ్చర్యపోయాం. సాధారణంగా మనమంతా తొమ్మిదో, పదో నంబరో చెప్పులు కొంటాం. కానీ, ఆయన చెప్పుల సైజు 20. దాంతో మేం ప్రత్యేకంగా ఆయనకు బూట్లు తయారు చేయించాం" అని పూరి జగన్నాథ్ తెలిపారు.
అలాంటి టైసన్‌తో తలపడేందుకు శారీరకంగా, మానసికంగా ఎంత దృఢంగా ఉండాలి? దాని కోసం సుమారు రెండేళ్లు శ్రమించాడట విజయ్ దేవరకొండ. ఫిట్‌నెస్ విషయంలో విజయ్ ఎంతో శ్రద్ధ తీసుకున్నారని, టైసన్ ఫిజిక్‌కు తగ్గట్టు తనని తాను మార్చుకున్నారని విజయ్ ఫిట్‌నెస్ ట్రైనర్ కుల్‌దీప్ సేథి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంకిత భావంతో పనిచేశాడని ఆయన కొనియాడారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే నటించింది. రమ్యకృష్ణ, గెటప్ శ్రీను, విష్ణురెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.
ఇదీ చూడండి: రాఘవేంద్రరావు పేరు వెనుక బీఏ ఎందుకో తెలుసా