Rogue websites blocked అనుమతుల్లేకుండా, అక్రమ పద్ధతుల్లో సినిమాలను ప్రదర్శిస్తున్న 'రోగ్' వెబ్‌సైట్లను అణిచి వేయాల్సిందేనంటూ దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబరు 9న విడుదల కానున్న 'బ్రహ్మాస్త్ర' చిత్రానికి సంబంధించి పైరసీ చిత్రం కొన్ని వెబ్‌సైట్లలో ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
రణ్‌బీర్ కపూర్- అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే.. పలు వెబ్‌సైట్లలో స్ట్రీమింగ్ అవుతోందని.. దీనిని తక్షణమే ఆపేసి, కారకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ చిత్ర సహ నిర్మాతలైన స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కోర్టును ఆశ్రయించింది. ఈ అనైతిక స్ట్రీమింగ్‌తో తీవ్రంగా నష్టపోతున్నామని ఫిర్యాదు దారులు తెలిపారు.
దీనిపై స్పందించిన జస్టిస్ జ్యోతిసింగ్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 18 వెబ్‌సైట్లను ముద్దాయిలుగా చేర్చుతూ 'పైరసీని ప్రోత్సహించే ఇలాంటి వెబ్‌సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాపీరైట్ ఉన్న కంటెంట్‌ని ప్రదర్శించినా, అందుబాటులో ఉంచినా, డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించినా, షేరింగ్‌కి అనుమతించినా, అప్‌లోడ్ సదుపాయం ఉన్నా అది చట్టాన్ని ఉల్లంఘించడమే. ఇలాంటి వెబ్‌సైట్లని వెంటనే నిషేధించాలి. ఇంటర్నెట్ ప్రొవైడర్లు వీరికి సేవలు నిలిపివేయాలి. వీరిపై ఉక్కుపాదం మోపేలా కేంద్రం తక్షణం చర్యలు తీసుకోవాలి' అని ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఇదీ చూడండి: బిగ్‌బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికంటే