Akkineni Family English titles : ఓ వ్యక్తికి పేరు ఎంత ముఖ్యమో.. సినిమాకు టైటిల్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సినిమాపై అంచనా, ఆసక్తి పెంచేందుకు.. అలాగే దానిపై బజ్ క్రియేట్ చేసే విషయంలో అవి కీలక పాత్ర పోషిస్తుంటాయి. అలా అని నచ్చిన టైటిల్‌ను పెట్టుకుంటే సరిపోదు. అది కథకు తగ్గట్టుగా ఉండాలి. లేదంటే ఇక అంతే సంగతి. అయితే ఈ టైటిల్స్‌లోనూ చిన్నది, పెద్దది, ప్రాంతీయ భాషలో, ఇంగ్లీష్‌లో.. ఇలా రకరకాలుగా ఉంటాయి. వీటిన్నంటిని కథకు సరిపోయేలా.. సెంటిమెంట్స్‌ను ఫాలో అవుతూ పెడుతుంటారు దర్శకనిర్మాతలు. కొన్ని సినిమాలు టైటిల్స్‌తో దూసుకెళ్తే.. మరికొన్ని సినిమాలు అదే టైటిల్స్‌తో నిరాశపరిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే కొంతకాలంగా గమనిస్తే కొన్ని ఇంగ్లీష్ టైటిల్స్.. అక్కినేని కుటుంబానికి దాదాపుగా కలిసి వచ్చినట్టుగా కనిపించట్లేదు.
నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన 'కస్టడీ' సినిమా మిక్స్డ్ టాక్‌తో బాక్సాఫీస్ ముందు యావరేజ్‌గా నిలిచింది. కలెక్షన్స్ విషయానికొస్తే మరీ దారుణంగా రూ.3 నుంచి రూ.4కోట్ల వరకే వచ్చాయని టాక్. ఇక తమిళంలో ఇరవై లక్షలు కూడా అందుకోలేదని సమచారం. ఇదిలా ఉండగా అయితే గతేడాది విడుదలైన చైతూ 'థ్యాంక్యూ' కూడా ఇంగ్లీష్ టైటిలే. ఆయన ఫస్ట్ సినిమా టైటిల్ 'జోష్' కూడా ఆంగ్ల పదమే. ఈ చిత్రాలన్నీ బాక్సాఫీస్ ముందు నిరాశపరిచినవే.
Akkineni Akhil Movies : మరోవైపు అక్కినేని నట వారసుడు అఖిల్.. లేటెస్ట్గా 'ఏజెంట్' అనే భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఫలితం దాదాపుగా అందరికీ తెలిసిందే. ఇది కూడా రెండేళ్ల పాటు భారీ అంచనాలతో ఊరించి మరీ వచ్చి అక్కినేని అభిమానులను నిరాశపరిచింది. కనీస వసూళ్లను కూడా అందుకోలేక బాక్సాఫీస్ ముందు చతికిలపడింది.
Nagarjuna Movie English Titles : ఇక నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్', 'ది ఘోస్ట్', 'ఆఫీసర్' సినిమా పేర్లు కూడా చూస్తే హాలీవుడ్ రేంజ్లో స్టైల్‌గా ఉంటాయి. కానీ ఈ సినిమాలన్నింటి మాత్రం ఒక్కటే. ఏం మార్పు లేదు. కనీసం యావరేజ్‌గా కూడా ఆడలేదు. అన్నీ నిరాశనే మిగిల్చాయి. అదే సమయంలో అక్కినేని ఫ్యామిలీ పెట్టుకున్న అచ్చమైన తెలుగు పేర్లు 'బంగార్రాజు', 'మజిలీ', 'మనం', 'శివ', 'ఏం మాయ చేశావే', 'సిసింద్రీ' .. ఇంకా ఎన్నో చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే ఇక్కడ అఖిల్ నటించిన ఇంగ్లీష్ టైటిల్ ఉన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మాత్రం పర్వాలేదనిపించింది.
Naga chaitanya movie English titles : చైతూ నటించిన 'కస్టడీ'కి.. టైటిల్ విషయంలో అభిమానులు ఓ పేరును సూచిస్తున్నారు. సినిమాలో హీరో పోషించిన కానిస్టేబుల్ పాత్ర పేరు 'శివ' అని పెట్టి ఉంటే.. కనీసం ఫస్ట్ రోజు మరింత ఎక్కువ మంది ఆడియెన్స్ థియేటర్లకు వచ్చేవారని అంటున్నారు. అలాగే ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో వచ్చేవని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ.. మంచి కథలతో పాటు టైటిల్స్ విషయంలోనూ మరింత జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: టాలీవుడ్ హీరోస్‌కు తమిళ డైరెక్టర్స్ షాకులు